దుండిగల్, ఆగస్టు 25 : చెరువులోకి స్నానానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యంకాగా, మరొకరి ఆచూకీ తెలియాల్సి ఉన్నది. బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు పోలీసుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి.. న్యూఢిల్లీలోని మకాన్ విష్ణుగార్డెన్కు చెందిన రాజు(37), ప్రకాశ్ రాథోడ్(50) కుటుంబసభ్యులతో కలిసి గత నాలుగేండ్ల కిందట నగరానికి వలస వచ్చారు. నగర శివారు ప్రాంతం, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి ఇంద్రానగర్ సమీపంలోని రోడ్డు పక్కన గుడిసెల్లో నివాసముంటూ గణేశ్ విగ్రహాలను తయారు చేస్తూ, వాటిని విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు.
ఈ క్రమంలో రాజు, ప్రకాశ్‌రాథోడ్ ఇద్దరు కలిసి గురువారం సాయంత్రం స్థానిక బైరుని చెరువులోకి స్నానం చేసేందుకు దిగి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యారు. స్నానానికి వెళ్లిన రాజు, ప్రకాశ్ రాథోడ్ ఎంతకి ఇంటికి రాకపోవడంతో రాజు కూతురు చెరువు వద్దకు వెళ్లి చూడగా.. చెరువు కట్ట వద్ద బట్టలు, చెప్పులు మాత్రమే కన్పించాయి. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలుపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే చీకటి పడటంతో శుక్రవారం ఉదయం నుంచి పోలీసులు, డీఆర్ఎఫ్ టీమ్, గజ ఈతగాళ్ల సాయంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రానికి రాజు మృతదేహం లభ్యమైంది. ప్రకాశ్‌రాథోడ్ ఆచూకీ లభించలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రాజుకు ఒక కూతురు ఉండగా, భార్య గతంలోనే విడాకులు ఇచ్చినట్లు తెలుస్తున్నది. ప్రకాశ్ రాథోడ్‌కు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అతడి భార్య సైతం గతంలోనే మరణించడంతో కూతుర్లతో కలిసి ఉంటున్నాడు.