సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ): గండిపేట గ్రామంలోని విలువైన ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు, తప్పుడు అధికారిక రికార్డులు సృష్టించి భారీ కుట్రకు పాల్పడిన కేసులో నార్సింగి పోలీసులు మరో ఇద్దరు కీలక నిందితులను అరెస్ట్ చేశారు. ఇప్పటికే గండిపేటకు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు, తాజాగా నకిలీ జీవోలు సృష్టించిన ప్రధాన నిందితుడు వెలది రాధాకృష్ణ (53), అతని డ్రైవర్ గ్యారా ప్రవీణ్ కుమార్ (34)లను అరెస్టు చేసినట్లు శేరీలింగంపల్లి డీసీపీ సిహెచ్.శ్రీనివాస్ వెల్లడించారు. ఆదివారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు పూర్వాపరాలను వివరించారు. గండిపేట గ్రామ సర్వే నంబర్ 18లోని ప్రభుత్వ పోరంబోకు భూమిపై అక్రమ హకులు సృష్టించేందుకు నకిలీ ప్రభుత్వ పత్రాలు తయారు చేసిన వ్యవహారంలో నార్సింగి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 990/2026 కింద నమోదైన విషయం తెలిసిందే.
సెక్రటేరియట్ ఉద్యోగి నుంచి మోసగాడిగా…
వెలది రాధాకృష్ణ 2006 నుంచి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఐటీ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేశాడు. ఆ సమయంలో ప్రభుత్వ కార్యాలయాల విధానాలపై అవగాహన పెంచుకున్న నిందితుడు, అనంతరం ఉద్యోగం వదిలి ఆ పరిచయాలను మోసాలకు వినియోగించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో తాను సచివాలయంలో డిప్యూటీ కలెక్టర్‌నని, అడ్వకేట్‌నని చెప్పుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాలు, భూ రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు, పట్టాదారు పాస్ బుకులు, వారసత్వ ధ్రువీకరణలు, ఇతర ప్రభుత్వ అనుమతులు ఇప్పిస్తానని ప్రజలను నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
2013లో నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి సుమారు రూ.30 లక్షలు వసూలు చేసి, మోసగించిన కేసులో కరీంనగర్ టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో రాధాకృష్ణపై తొలిసారి నమోదైంది. అయినప్పటికీ ప్రవర్తన మార్చుకోకుండా నిందితుడు పలువురిని ఇదే తరహాలో మోసం చేస్తూ డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. సచివాలయంలో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని వెంకటాచారి అనే వ్యక్తి నుంచి రూ.18 లక్షలు, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానని మొయినాబాద్‌కు చెందిన దివాకర్ నుంచి రూ.3 లక్షలు తీసుకుని మోసం చేసినట్లు కేసులు నమోదయ్యాయి. రాజేంద్రనగర్, నేరేడ్ మెట్, గోదావరిఖని, కరీంనగర్, కర్నూలు జిల్లాల్లోని పలు పోలీస్ స్టేషన్లలో సైతం నిందితుడిపై అనేక కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
భూ కుంభకోణాల వైపు….
ఉద్యోగాల పేరుతో చేసిన మోసాల ద్వారా వచ్చిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడిపిన రాధాకృష్ణ, అనంతరం భారీ లాభాల కోసం భూ మోసాల వైపు మళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో గండిపేట గ్రామ సర్వే నంబర్ 18లోని ప్రభుత్వ భూమిపై హకులు ఉన్నట్లు చెప్పుకునే వ్యక్తులతో పరిచయం పెంచుకుని, ఆ భూమి ద్వారా భారీగా డబ్బు సంపాదించాలని యోచించినట్లు దర్యాప్తులో తేలింది. తన డ్రైవర్ ప్రవీణ్ కుమార్ ద్వారా కొవ్వూరు సునీల్‌తో పరిచయం పెంచుకున్న రాధాకృష్ణ, నిమ్మల రాజేష్, నిమ్మల వేణుగోపాల్, నిమ్మల రామస్వామి, గారెల మంగా, వారి కుటుంబ సభ్యులతో సంబంధాలు ఏర్పరచుకుని భూకబ్జాలకు అవసరమైన నకిలీ పత్రాలు సృష్టించేందుకు కుట్ర పనిన్నట్లు తెలిపారు.
నకిలీ జీవోలు, తప్పుడు సీసీఎల్ ఏ ప్రొసీడింగ్స్…
గండిపేట భూమి పూర్తిగా ప్రభుత్వ పోరంబోకు భూమి అని, దానిపై ఎటువంటి చట్టబద్ధ హకులు లేవని రాధాకృష్ణకు తెలిసినప్పటికీ, నకిలీ పత్రాలు సృష్టించి ఇస్తానని, భూమిని కొనుగోలు చేయాలనుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, అతని సోదరుడు రమేష్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వారి నుంచి భారీగా డబ్బులు తీసుకున్న నిందితులు, తరువాత అసలు ప్రభుత్వ అనుమతులు పొందడం సాధ్యం కాదని తెలుసుకున్న రాధాకృష్ణ, మరో అడ్వకేట్ సహాయంతో కలిసి నిమ్మల రాజేష్, వేణుగోపాల్, రామస్వామి, గారెల మంగా, బ్రహ్మనాయుడు, రమేష్ తదితరులతో కలిసి నకిలీ జీవోలు, తప్పుడు సీసీఎల్ ఏ ప్రొసీడింగ్స్, నకిలీ ఎన్వోసీలు, అధికారిక లేఖలు, ఇతర ప్రభుత్వ పత్రాలను తయారు చేశారు. ఈ పత్రాల్లో సీనియర్ ప్రభుత్వ అధికారుల పేర్లు, సంతకాలను ఫోర్జరీ చేసి అవి అసలైన ప్రభుత్వ ఉత్తర్వుల మాదిరిగా కనిపించేలా రూపొందించినట్లు వెల్లడైంది.
రూ.12 కోట్ల ఆర్థిక లావాదేవీలు
ఈ భూమి వ్యవహారంలో బ్రహ్మనాయుడు, రమేష్ ఇతర వ్యక్తుల మధ్య సుమారు రూ.12 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వీటిపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. ఈ వ్యవహారంలో కేసు నమోదైన తరువాత రాధాకృష్ణ పరారయ్యేందుకు ప్రయత్నించగా, అతని డ్రైవర్ ప్రవీణ్ కుమార్ పత్రాలను దాచిపెట్టడం, సమాచార మార్పిడిలో సహకరించడం, పోలీసుల కదలికలను తెలియజేయడం వంటి చర్యల ద్వారా నిందితుడికి ప్రత్యక్షంగా సహాయం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో డ్రైవర్ ప్రవీణ్‌కుమార్‌ను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి నకిలీ ప్రభుత్వ జీవోలు, 5 ల్యాప్ టాప్ లు, 12 చెక్ బుకులు, 13 స్టాంపులు, 7 బ్యాంక్ పాస్ బుకులు, 10 ఏటీఎం కార్డులు, 31 భూ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు డీసీపీ తెలిపారు.