సిటీబ్యూరో, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): ఫ్లాట్ విక్రయం పేరుతో భారీగా అడ్వాన్స్ తీసుకొని మోసాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ కథనం ప్రకారం.. టోలిచౌకి నివాసి ఖాజా ముజీబుద్దీన్, మహ్మద్ జాజిమ్ ముజీబుద్దీన్ కలిసి 2016లో టోలిచౌకిలో క్రిస్టల్ కన్స్ట్రక్షన్ పేరుతో సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా డెవలప్మెంట్ పద్ధతిలో భూ యజమానుల నుంచి ఒప్పందం చేసుకొని అపార్టుమెంట్ నిర్మాణానికి స్థలం తీసుకున్నారు. అపార్టుమెంట్ నిర్మాణం ప్రారంభించి, ఫ్లాట్ బుకింగ్ కూడా ప్రారంభించారు.
టోలిచౌకితో పాటు గల్ఫ్ దేశాల్లో ఉన్న వారికి కూడా అపార్టుమెంట్లు విక్రయిస్తామంటూ నమ్మించారు. 20 మంది నుంచి దాదాపు రూ. 20 కోట్లు వసూలు చేశారు. అపార్టుమెంట్ నిర్మాణం పూర్తి చేయకుండానే.. సొంతంగా ఆస్తులు కొనుగోలు చేశారు. అపార్టుమెంట్ నిర్మాణం పూర్తి చేయకుండానే మధ్యలోనే ఆపేసి కొనుగోలుదారులను మోసం చేశారు. బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసు గురించి తెలుసుకున్న నిందితులిద్దరూ విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించారు. పక్కా సమాచారంతో నిఘా పెట్టిన పోలీసులు గురువారం ఇద్దరు నిందితులను రాంకోఠిలో అరెస్టు చేశారు.