సిటీబ్యూరో, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఎస్కార్ట్‌తో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న రెండు అంతర్రాష్ట్ర ముఠాలు పట్టుబడ్డాయి. మేడ్చల్ జోన్ పోలీసులకు ఒక ముఠా పట్టుబడగా.. మరోముఠా మాదాపూర్ జోన్ పోలీసులకు చిక్కింది. ఈ రెండు ముఠాల నుంచి రూ. 3 కోట్ల విలువజేసే గంజాయి, వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలకు సంబంధించిన వివరాలను మంగళవారం విలేకరుల సమావేశంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మహ్మద్ ఇనామ్, మహ్మద్ సాద్, హర్యానాకు చెందిన బంటి కాశ్యప్ అలియాస్ బంటికుమార్, లలిత్‌కుమార్ కాశ్యప్, రాజ్‌పుత్ ఒక ముఠాగా ఏర్పడ్డారు. ప్రధాన నిందితుడైన మహ్మద్ ఇనామ్పై యూపీలో పలు దొంగతనాలు, దోపిడీ కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇనామ్‌తో సోలాపూర్‌కు చెందిన బబ్లూ షిండే గంజాయి రవాణాపై ఒప్పందం చేసుకున్నాడు. ఇందుకు సుభాష్ అనే వ్యక్తిని కలిస్తే గంజాయి విషయంలో సహకరిస్తాడంటూ కంట్రాక్టు కుదుర్చుకున్నారు.
ఏపీలో గంజాయి తీసుకొని తెలంగాణ మీదుగా మహారాష్ట్ర వెళ్లేందుకు ప్రధాన నిందితుడు ఒక పిస్టోల్, రెండు మ్యాగ్జిన్స్, 14 లైవ్ రౌండ్స్‌ను తన కున్న పాత నేరస్తుల పరిచయాలతో ఆస్ మహ్మద్ నుంచి కొనుగోలు చేశాడు. అరకు వెళ్లి అక్కడ 508 కిలోల గంజాయి తీసుకొని రావాలని, అడ్వాన్స్‌గా రూ. 4.5 లక్షలు ఇచ్చి షిండే ఇటీవల ఇనామ్ గ్యాంగ్‌కు పనిని అప్పగించాడు. దీంతో రెండు వాహనాలలో అరకు వెళ్లి, అక్కడ సుభాష్‌ను కలిశారు. సుభాష్ 508 కిలోల గంజాయిని ఒక్కొక్కటి రెండు నుంచి మూడు కిలోలు ఉండే విధంగా 170 ప్యాకెట్లు చేసి ఎవరూ గుర్తుపట్టకుండా కారులో ప్యాక్ చేశాడు. ఆ కారును ముఠా నాయకుడికి అప్పగించాడు. విశ్వసనీయ సమాచారంతో ఎస్ఓటీ మేడ్చల్ జోన్, దుండిగల్ పోలీసులు దుండిగల్ ప్రాంతంలోని ఓఆర్ఆర్పై ఎస్కార్ట్‌తో వెళ్తున్న ఈ గంజాయి ముఠాను పట్టుకున్నారు. ఇద్దరు మహేంద్ర వాహనంలో గంజాయితో, మరో ఇద్దరు షిప్ట్ వాహనంలో పోలీసులకు చిక్కారు. వారి నుంచి దేశీవాళీ పిస్టోల్, లైవ్ రౌండ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రెండు కార్లు సీజ్ చేసి, అందులో ఉన్న 508 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో కిలో రూ. 3 వేలకు కొనుగోలు చేసి, రూ. 25 వేలకు విక్రయించాలని ఈ ముఠా ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. ఈ ముఠా నుంచి రూ. 1,49,10,500 విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
రాజమండ్రి నుంచి మహారాష్ట్రకు గంజాయి రవాణా చేస్తున్న లారీ డ్రైవర్ విశాల్ చంద్రశేఖర్ షిండే, క్లీనర్ సాగర్ బహబన్ దేశ్‌ముఖ్, సూత్రధారి ఆంధ్రప్రదేశ్ వాసి రహమాన్‌ను మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. 720 కిలోల గంజాయిని ఒక్కోటి 5 కిలోల చొప్పున ఉన్న 144 ప్యాకెట్లను డీసీఎంలో రహస్యంగా భద్రపరిచారు. తెలంగాణ మీదుగా మహారాష్ట్ర ఔరంగాబాద్‌కు తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకకు ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు, నార్సింగి పోలీసులతో కలిసి మంచిరేవుల వద్ద డీసీఎం వాహనాన్ని ఆపి తనిఖీ చేయడంతో భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. 720 కిలోల గంజాయితో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడితో పాటు లారీ డ్రైవర్, క్లీనర్‌ను అరెస్ట్ చేశారు. గంజాయి విలువ రూ. 1.64 కోట్లు ఉంటుందని సీపీ వెల్లడించారు.