ఎల్బీనగర్, అక్టోబర్ 19: అదుపుతప్పిన దున్నపోతు వీరంగం సృష్టించింది. కొత్తపేట మోహన్‌నగర్ స్మశాన వాటికలో ఇద్దరు వ్యక్తులపై దాడి చేయడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం న్యూ నాగోలు స్నేహపురికాలనీలోని ఓ పాల వ్యాపారికి చెందిన దున్నపోతు ఆదివారం మధ్యాహ్నం అదుపుతప్పి పరుగులు పెట్టి ఓ ఫంక్షన్ హాల్లో హంగామా చేసింది. అయితే ఆ ఫంక్షన్ హాల్లో ఎలాంటి ఫంక్షన్ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
దున్నను పట్టుకునేందుకు సదరు వ్యక్తులు చేసిన ప్రయత్నం విఫలం కాగా దున్నపోతు అక్కడి నుండి పారిపోయి మోహన్‌నగర్ జనప్రియ క్వార్టర్స్ వెనుక మూసీ పక్కన ఉన్న స్మశాన వాటిక లోపలికి చేరింది. ఆ సమయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్తపేట గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు గోరీల వద్ద తమ పూర్వికులకు పూజలు చేసేందుకు ముందస్తుగా గోరీలకు రంగులు వేస్తున్నారు. ఈ క్రమంలో అదుపుతప్పిన దున్నపోతు అక్కడికి చేరుకుని కొత్తపేటకు చెందిన ఎర్ర కృష్ణను పొడిచింది. దీంతో కృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి.
ఈ దాడిని ఆపేందుకు ప్రయత్నించిన నాగరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు స్థానికులు గట్టిగా ప్రయత్నించి దున్నను కింద పడేసి కాళ్లను కట్టివేయడంతో అదుపులోకి వచ్చింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఎర్ర కృష్ణను నాగోలులోని ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స జరిపిస్తున్నారు. దున్నపోతు దాడి సమాచారం అందుకున్న పోలీసులతో పాటుగా కార్పొరేటర్ పవన్‌కుమార్, స్మశాన వాటిక కమిటీ ప్రతినిధులు సంఘటనా స్థలానికి చేరకుని పరిస్థితిని తెలుసుకున్నారు.