ఖైరతాబాద్, మార్చి 22 : బాల్కని స్లాబ్ కూలి ఇద్దరు ఎలక్ట్రీషియన్లు మృతిచెందారు. ఈ ఘటన పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. సీతారాంబాగ్‌కు చెందిన దేవీదాస్ (60), అతడి అల్లుడు వరుసైన వివేక్ (30)లు ఎలక్ట్రీషియన్లుగా పనిచేస్తున్నారు. కుందన్‌బాగ్ మెథడిస్ట్ కాలనీలోని శ్రీవాత్స అపార్ట్మెంట్ యజమాని ద్వారకాప్రసాద్ ఎలక్ట్రీషియన్ పనుల కోసం వారిని పిలిపించాడు. పనుల కోసం ముగ్గురు కలిసి మూడో అంతస్తుకు వెళ్లారు.
అక్కడ బాల్కని స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ముగ్గురు కిందపడిపోయారు. ఈ ఘటనలో దేవీదాస్, వివేక్‌లు అక్కడికక్కడే మృతిచెందగా, యజమాని ద్వారకాప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను గాంధీ దవాఖానకు తరలించారు. యజమాని ద్వారకాప్రసాద్ ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.