సిటీబ్యూరో/వెంగళరావునగర్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ పార్టీపై టీనాబ్ అధికారులు దాడి చేసి.. ఇద్దరు మాదకద్రవ్యాల విక్రేతలతో పాటు 12 మంది వినియోగదారులను పట్టుకున్నారు. వీరికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు టీనాబ్ ఎస్సీ సునీతారెడ్డి తెలిపారు. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో(టీనాబ్) ఎస్పీ సునీతారెడ్డి కథనం ప్రకారం.. నెల్లూరుకు చెందిన జల్లి అశిక్ యాదవ్(28), స్నేహితుడైన రాజేశ్ ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్‌లో ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఈ ఇద్దరు స్నేహితులు బెంగళూర్, గోవా నుంచి తరచూ మత్తు పదార్థాలు తెచ్చి తాము వాడడంతో పాటు తమ సర్కిల్లో ఉన్న వారికి అందజేస్తుంటారు. ఇలా వీళ్లకు తెలిసిన స్నేహితులు, వారి సర్కిళ్లలో ఫామ్ హౌస్‌లు, పబ్‌లు, కిట్టీ పార్టీలు, సర్వీస్ అపార్టుమెంట్లలో డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల గోవాకు వెళ్లి 60 ఎక్స్టాసీ పిల్స్ కొనుగోలు చేసి మొదట నెల్లూరుకు వెళ్లారు. అక్కడ తమ స్నేహితులతో కలిసి పార్టీలు చేశారు. ఆ తరువాత తమ టీమ్‌తో కలిసి హైదరాబాద్‌కు వచ్చి తిరిగి పార్టీలు చేసుకుంటున్నారు.
ఒక్కో పిల్‌ను గోవాలో వెయ్యి రూపాయలకు కొని, దానిని ఇక్కడ రూ. 2500 విక్రయిస్తున్నారు. స్నేహితుల సర్కిల్ నుంచి మంచి డిమాండ్ ఉండడంతో అప్పుడప్పుడు గోవా, బెంగళూర్‌కు వెళ్లి డ్రగ్స్ కొని తెస్తున్నారు. ఇటీవల గోవాకు వెళ్లి బాబా అనే వ్యక్తి వద్ద నుంచి డ్రగ్స్‌ను కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే టీ నాబ్‌కు విశ్వసనీయ సమాచారంతో అశిక్ యాదవ్‌ను ఈ నెల 16న అదుపులోకి తీసుకొని విచారించడంతో అతడి వద్ద రెండు పిల్స్ లభించాయి. అతడికి ఇచ్చిన సమాచారం మేరకు మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా దుడ్డు రాజేశ్ ఆధ్వర్యంలో ఎస్ఆర్నగర్లో పార్టీ నిర్వహిస్తున్నాడనే సమాచారంతో టీ నాబ్ ఇన్స్పెక్టర్ రాజేశ్ బృందం, ఎస్ఆర్నగర్ పోలీసులతో కలిసి పార్టీపై దాడి చేశారు. ఇందులో రాజేశ్‌తో పాటు 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ గ్యాంగ్‌లో 33 మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడ్డ వినియోగదారులకు డ్రగ్స్ టెస్టింగ్ నిర్వహించడంతో ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు తేలింది. మిగతా వారి వద్ద కూడా డ్రగ్స్ పిల్స్‌ను పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి 40 డ్రగ్స్ పిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విచారణను ఎస్ఆర్నగర్ పోలీసులకు అప్పగించారు. నిందితుల వద్ద నుంచి డ్రగ్స్, ఒక కారు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలాఉండగా రాచకొండ రూ. 56 లక్షల విలువైన ఓపీఎంను మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారని సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు.