పతంగుల సరదా.. పండుగ పూట విషాదం మిగిల్చింది. ఇద్దరు యువకులను బలితీసుకున్నది. పతంగి ఎగురవేస్తూ.. ప్రమాదవశాత్తు లిఫ్టు గుంతలో పడిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా.. మరో చిన్నారి విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందాడు. ఈ సంఘటనలు మధురానగర్, మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ల పరిధుల్లో చోటుచేసుకున్నాయి.
మైలార్‌దేవ్‌పల్లి / వెంగళరావునగర్, జనవరి 16 : కాటేదాన్ గణేశ్ నగర్ ప్రాంతానికి చెందిన సంతోష్, శ్రావంతిల కుమారుడు వివేక్(10) స్థానికంగా ఉన్న రవి బ్రిలియంట్ హై స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఉదయం వివేక్ గాలిపటం ఎగురవేస్తున్న క్రమంలో విద్యుత్ తీగలకు చిక్కుకున్నది. పతంగిని తీసుకునే ప్రయత్నం విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రహ్మత్‌నగర్‌లో లిఫ్ట్ గుంతలో పడి
రహ్మత్‌నగర్‌కు చెందిన కపిల్ దేవ్(23) సోమవారం సాయంత్రం తన స్నేహితులలో స్థానికంగా ఉన్న ఐదు అంతస్థుల భవనంపైకి ఎక్కి పతంగులు ఎగురవేశారు. ఈ క్రమంలో 3వ అంతస్థులో మెట్లు దిగుతూ ప్రమాదవశాత్తు లిఫ్ట్ కోసం ఏర్పాటు చేసిన గుంతలో పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన కలిప్దేవ్ను చికిత్స నిమిత్తం యూసుఫ్‌గూడలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించగా అప్పటికే కపిల్ దేవ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సంఘటనా స్థలాన్ని పంజాగుట్ట ఏసీపీ ఎస్.మోహన్ కుమార్, మధురానగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్.ఐ ఇక్బాల్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.