హైదరాబాద్: హైదరాబాద్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో నగరంలోని జంట జలాశయాలకు వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో హిమాయత్ సాగర్ (Himayat Sagar) రెండు గేట్లను (Crest gates) జలమండలి అధికారులు ఎత్తివేశారు. ప్రస్తుతం సాగర్లోకి 1200 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 1373 క్యూసెక్కుల నీరు మూసీలోకి వెళ్తున్నది.
సాగర్లో ఇప్పుడు 1763.20 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు. వర్షం ఇలాగే కురుస్తుండటంతో హిమాయత్ సాగర్ మరో రెండు గేట్లను ఎత్తివేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గేట్లను ఎత్తివేయడంతో జంట జలాశయాల పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. ఇక.. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో గండిపేటకు వరద వచ్చి చేరుతున్నది.