శంషాబాద్ రూరల్, జూన్ 3 : నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు సరఫరా చేస్తున్న ఓ ముఠా సభ్యులను శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు ఆరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన మంగళవారం జరిగింది. శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్‌గౌడ్ వివరాలను మీడియాకు వివరించారు. నల్లకొండ జిల్లాకు చెందిన గోపాల్‌రెడ్డి అనే వ్యక్తి డిగ్రీ పూర్తి చేసిన్నట్లు సర్టిఫికెటు కావాలని 2021 ఆగస్టు నెలలో బీఎన్‌రెడ్డి నగర్ హస్తినాపురం గ్రామానికి చెందిన అశోక్ అనే వ్యక్తిని కలువగా.. రూ.80వేలు తీసుకొని కేరళ రాష్ర్టానికి చెందిన మరో వ్యక్తి సహకారంతో తమిళనాడు రాష్ట్రంలోని మధురై కామరాజ్ యూనివర్సిటీలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ 2015నుంచి 2018వరకు పూర్తి చేసినట్లుగా నకిలీ సర్టిఫికెట్ అందించాడు.
నకిలీ సర్టిఫికెట్ ద్వారా యూఎస్ఏలోని వెబ్‌స్టార్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది. దీంతో 28-09-2023 తేదీన యూఎన్ఏకు వెళ్లి అక్కడ 15 నెలల పాటు చదువుకొని తిరిగి ఇండియాకు వచ్చాడు. తిరిగి చదువుకోవడం కోసం యూఎస్ఏకు వెళ్లగా అక్కడి ఎయిర్‌పోర్టు అధికారులు వెనక్కి పంపించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అతడిపై అనుమానం వచ్చిన ఆర్జీఐఏ ఇమిగ్రేషన్ అధికారులు అతడి సర్టిఫికెట్లు పరిశీలించగా.. నకిలీవిగా గుర్తించారు. దీంతో నిందితుడిని శంషాబాద్ ఆర్జీఐఏ అవుట్‌పోస్టు పోలీసులకు అప్పగించారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు హస్తినాపురం గ్రామానికి చెందిన అశోక్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ శ్రీధనలక్ష్మీ ఓవర్సిస్ ప్రైవేటు లిమిటెడ్(స్టడీ అబ్రాడ్ కన్సల్టెన్సీ) నడిపిస్తున్న వ్యక్తి కేరళకు చెందిన మరో వ్యక్తితో కలిసి నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి సర్టిఫికెట్ లక్ష రూపాయలకు అమ్ముతున్నట్లు గుర్తించారు. కేరళకు చెందని వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన్నట్లు వివరించారు. నిందితుల నుంచి రూ.10లక్షల నగదుతో పాటు సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, నకిలీ స్టాంపులు, బ్యాంకు ఖాతాలు మధురై యూనివర్సిటీకి చెందిన 13, ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన నలుగురు వ్యక్తులకు పేర్లు ఉన్న నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.