బేగంపేట్ మే 21: యజమాని ఇంట్లో లేని సమయంలో పని మనిషులే దొంగతనానికి పాల్పడి దేశ సరిహద్దు దాటిపోయారు. కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు ఆ ముఠాలోని ఇద్దరిని అరెస్ట్(Arrested) చేశారు. వారి వద్ద ఐదు లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. రాంగోపాల్‌పేట్ పోలీస్ ఇన్స్పెక్టర్ నర్సింగరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్ పీజీ రోడ్డులో నివసించే బంగారం వ్యాపారి(Gold merchant) ఇంట్లో నేపాలికి చెందిన రాజ్ ఖడ్కా (32) అనే వ్యక్తి పని చేసి మానేశాడు.
ఇక్కడ పని చేసే క్రమంలోనే మిలాన్ (28), వికాస్షా(29) ఇదే రోడ్డులో ఫుట్‌పాత్‌పై హోటల్ నిర్వహించేవారు. వీరు ముగ్గురు స్నేహితులయ్యారు. దొంగతనాలు చేసి సరిహాద్దులు దాటి పారిపోయే వీడిమోలను చూసి ఎలాగైన దొంగతనం చేయాలని ఈ ముగ్గురు నిర్ణయం తీసుకున్నారు. ఈ తరుణంలో రాజ్ ఖడ్కా పీజీ రోడ్డులో ఉండే బంగారం వ్యాపారి ఇంట్లో పని చేసి కొంతకాలం క్రితం మానేశాడు. ఇతని ద్వారా ఆ వ్యాపారి ఇంట్లో పనిచేసే శారద అనే మహిళతో మిలాన్, వికాస్‌లు పరిచయం పెంచుకున్నారు.
శారద ద్వారా పని మనిషిగా మరో మహిళ సుష్మితను చేర్పించారు. వీరితో పాటు మిలాన్ అతడి భార్య భావన నగరానికి వచ్చిఆ యజమాని ఇంట్లో పని మనుషులుగా చేరారు. ఈ క్రమంలో రాజ్ ఖడ్కా ద్వారా మొదటగా వచ్చిన సుష్మితను నల్లకుంటలోని ఓ గదిలో అద్దెకు ఉంచారు.
గత నెల 30 వ్యాపారి కుటుంబం ముంబైకి వెళ్లిన సమయాన్ని చూసుకోని అదను చూసి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు సుమారు 30 లక్షల సొత్తును కాజేసి వీరంతా నేపాల్‌కు పారిపోయారు. యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముఠాలోని ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మిగిలిన మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలిపారు.