సిటీబ్యూరో,ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ పరిధిలో విద్యుత్ వినియోగదారులు ఆన్లైన్ చెల్లింపుల పట్ల ఆసక్తి చూపుతున్నారు.కరోనా నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎస్పీడీసీఎల్) ఆన్‌లైన్‌కు అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇందు లో భాగంగానే విద్యుత్ కలెక్షన్ల జారీ మొదలు బిల్లుల చెల్లింపులన్నీ ఆన్లైన్ చేసి, అమలులో తీసుకుంటున్న పారదర్శక చర్యలతో వినియోగదారులు మెరుగైన సేవలను పొందుతున్నారు. ముఖ్యంగా కరోనా ప్రభావం వల్ల విద్యుత్ బిల్లుల చెల్లింపుల్లో ఆన్లైన్ విధానంలో గణనీయంగా మెరుగుదల కనిపించింది. సాధారణంగా గతంలో ఆన్లైన్లో బిల్లులు చెల్లించే వినియోగదారులు15లక్షల వరకు (25-30శాతం) ఉంటేఆ సంఖ్య ఇప్పుడు 36 లక్షలు దాటింది.
మొత్తంగా గ్రేటర్ పరిధిలోని 9 సర్కిళ్ల పరిధిలో 52.76 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉంటే అందులో 69.83 శాతం బిల్లులను ఆన్లైన్ ద్వారానే గత నెలలో వసూలయ్యాయని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. బంజారాహిల్స్ సర్కిల్లో ఫోన్‌పే ద్వారా 24.73 శాతం మంది బిల్లులు చెల్లిస్తే, పేటీఎం ద్వారా 25.23 శాతం మంది చెల్లించారు. అదేవిధంగా సైబర్ సిటీ సర్కిల్లో ఫోన్‌పే ద్వారా 23.97, పేటీఎం ద్వారా 30.49 శాతం మంది చెల్లించారు. ఇలా మిగతా 7 సర్కిళ్ల పరిధిలోనూ ఈ రెండు యాప్‌ల ద్వారానే 50 శాతానికి పైగా చెల్లింపులు చేస్తున్నారని తెలిపారు.
వీటితో పాటు టీ వ్యాలెట్, బిల్ డెస్క్, ఈసీఎస్ ద్వారా మరో 20 శాతం మంది బిల్లు చెల్లిస్తున్నారు. బిల్లుల చెల్లింపులో లోపాలను ఆన్లైన్ ద్వారానే పరిష్కరించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఇటీవల అధికారుల సమీక్షలో ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ బిల్లుల నెలవారీ చెల్లింపులో సంస్థ ఆన్లైన్/ఆఫ్‌లైన్ సేవలను ప్రవేశపెట్టింది. గ్రేటర్ డిస్కం పరిధిలోని దాదాపు 52.76 లక్షల కనెక్షన్లకు గానూ నెలవారీగా సుమారు రూ. 710 నుంచి 760 కోట్లు వసూలు అవుతుండగా, గత నెల జూలై రూ. 710కోట్ల మేర విద్యుత్ బిల్లులు రూపేణా కలెక్షన్లను వసూలు చేసింది.
ఈఆర్ఓ, స్పాట్ కలెక్షన్స్, ఈ-సేవా కేంద్రాలు, కార్పొరేట్ కలెక్షన్స్, టీఎస్ ఆన్లైన్, బిల్ జంక్షన్, బిల్ డెస్క్ ఈసీఎస్, బిల్ డెస్క్ వెబ్సైట్ (www.tssouthernpower.com), పేటీఎం, టీఏ వ్యాలెట్, టీ వ్యాలెట్, ఫోన్ పేల ద్వారా విద్యుత్ వినియోగదారులు నెల వారి బిల్లులను చెల్లిస్తున్నారు.