
సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ) : నగర మహిళలకు ఇది ఊరటనిచ్చే అంశమే. మహిళా ప్రయాణికులకు రక్షణ చర్యల్లో భాగంగా మరింత మెరుగైన సేవలందించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. రాత్రి వేళలో వారు గమ్యస్థానానికి వెళ్లేందుకు ఇబ్బందులు పడకుండా చెయ్యెత్తిన చోట బస్సు ఆపి.. ఎక్కించుకునేలా వెసులుబాటు కల్పించింది. ఈ నిబంధన కచ్చితంగా పాటించాలని మొత్తం 29 డిపోల ఆధ్వర్యంలో పని చేసే కండక్టర్లు, డ్రైవర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ చెయ్యి ఎత్తినా.. బస్సు ఆపకపోతే సదరు మహిళా ప్రయాణికులు డిపో మేనేజర్లకు ఫోన్ చేయవచ్చు. ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఈడీ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.