విద్యుత్ రంగ ప్రైవేటీకరణతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా టీఎస్పీడీసీఎల్ ( TSSPDCL ) కార్యాలయం ఎదుట తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నిరసన తెలిపింది. సంయుక్త కిసాన్ మోర్చా, సెంటల్ ట్రేడ్ యూనియన్స్ తలపెట్టిన దేశవ్యాప్త ఆందోళనకు కూడా ఈ సందర్భంగా మద్దతు ప్రకటించారు. నేషనల్ కో-ఆర్డినేషన్ కమిటి ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ మరియు ఇంజనీర్స్ సెంట్రల్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మధ్యాహ్న భోజన విరామ ప్రదర్శన (Lunch Hour Demonstration) చేశారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చేస్తే ఊరుకునేది లేదని.. మెరుపు సమ్మెకు దిగుతామని TSPEJAC నాయకులు వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా హెచ్చరించారు.
విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు 2019, 2021, 2022లో బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు దేశవ్యాప్తంగా 25 లక్షల మంది ఉద్యోగులు ఏకమై.. దాన్ని అడ్డుకున్నారని TSPEJAC నాయకులు వెంకటేశ్వర్లు, కన్వీనర్ రత్నాకర్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 11 రాష్ట్రాల్లో విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లును వ్యతిరేకించారని తెలిపారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చేయకుండా ఎవరు అడ్డుకుంటారో వారికే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తమ మద్దతు ఉంటుందని జేఏసీ నాయకులు గోవర్ధన్, తులసి నాగరాణి వెల్లడించారు.