
సిటీబ్యూరో, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ రాజకీయాల్లో టీఆర్ఎస్కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. నాడు ఒకే ఒక్కడితో మొదలైన ఆ పార్టీ ప్రస్థానం.. నేడు వరుసగా బల్దియాపై రెండుసార్లు గులాబీ జెండా ఎగురవేసి తిరుగులేని శక్తిగా తన ప్రత్యేకతను చాటుకుంటున్నది. గ్రేటర్లో బలం లేదంటూ నగుబాటుకు గురైన గులాబీ పార్టీ ఇప్పుడు సగర్వంగా కాలర్ ఎగురేస్తున్నది. చరిత్రను సృష్టిస్తూ సొంతంగా రెండోసారి మేయర్ స్థానాన్ని దక్కించుకొని తన సత్తాను చాటగా.. అటు అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకున్నది. గ్రేటర్లో 24 నియోజకవర్గాల పరిధిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్యాబలం 16 ఉండటం గమనార్హం. ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గ్రేటర్లో టీఆర్ఎస్ ప్రస్థానం.. స్వరాష్ట్ర పాలనలో అభివృద్ధిని పరిశీలిస్తే..
2001లో ఉద్యమపార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ ఆ మరుసటి ఏడాది 2002లో జరిగిన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీహెచ్) ఎన్నికల్లో పోటీ చేసింది. అప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ ఆవిర్భవించలేదు. నాడు టీఆర్ఎస్ 50కి పైగా డివిజన్లలో పోటీ చేసినప్పటికీ, ఒకే ఒక డివిజన్లో విజయం సాధించింది. ఆ ఒక్కరే ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు. అనంతరం ఎంసీహెచ్ కాస్త గ్రేటర్ హైదరాబాద్‌గా రూపాంతరం చెందింది. ఉమ్మడి రాష్ట్రంలో మొదటి సారి.. చివరిసారిగా 2009లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి. కానీ అప్పుడు టీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంది. గ్రేటర్లో బలం లేకపోవడంతోనే గులాబీ దళం పోటీ చేయలేదని అంతా హేళన చేశారు.
కానీ టీఆర్ఎస్ మాత్రం రాష్ట్ర ఏర్పాటు, ఉద్యమంపైనే దృష్టి సారించి ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ ఉధృతి, చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో టీఆర్ఎస్ అజేయశక్తిగా ఎదుగుతూ వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 స్థానాలను గెలుచుకుని ఒంటరిగా మేయర్ స్థానాన్ని దక్కించుకున్నది. తిరిగి గతేడాది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీ సీట్లతో మేయర్ స్థానాన్ని టీఆర్ఎస్ పదిలం చేసుకుంది. వరుసగా రెండుసార్లు జీహెచ్ఎంసీపై గులాబీ జెండాను ఎగరవేసింది.
ఉద్యమ నాయకుడే సీఎం అయిన వేళ హైదరాబాద్ ప్రగతిపథకంలోకి దూసుకు వెళ్తున్నది. ఏడేండ్లు దాదాపు 426 పథకాలు.. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది టీఆర్ఎస్ ప్రభుత్వ ఘనత.. జోడెద్దుల మాదిరి ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి పరుగులు పెట్టింది. అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచే అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించింది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్‌తో ‘ఆసరా’గా నిలిచింది. ఆడపడుచులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌తో చేయూతనందిస్తున్నది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో రైతుబంధు, రైతుబీమాతో అన్నదాతకు ఆత్మబంధువై నిలిచింది.
మాతాశిశు సంరక్షణకు కేసీఆర్ కిట్లను ప్రవేశపెట్టింది. యాదవులకు గొర్రెల పంపిణీ, రజకులు, మత్స్యకారులు, నాయీ బ్రాహ్మణులు.. ఇలా సబ్బండవర్గాలకు బాసటగా నిలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, ఏదో రూపంలో ప్రతి గడపకూ లబ్ధి చేకూరేలా చూస్తున్నది. గ్రేటర్లో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి, నిరంతర విద్యుత్, సమృద్ధిగా తాగునీరు, సంక్షేమ పథకాలు, శాంతిభద్రతలను అదుపులో ఉంచు తుంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా రాబోయే మూడేండ్లలో రూ.50వేల కోట్లను ఖర్చు చేయాలని చూస్తున్నది. మొత్తంగా గ్రేటర్‌ను మెరిపించే కార్యక్రమాలను నిరంతరం చేస్తుండటంతో నగరవాసులు గులాబీ పార్టీకే పట్టం కడుతుండటం విశేషం.