
సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్ టీఆర్ఎస్లో సంస్థాగత సంబురం నెలకొన్నది. 60 లక్షలకుపైగా సభ్యత్వాల బలమైన బలగంలో నాయకత్వ స్థానాల్లో ఉండేందుకు పార్టీ క్రియాశీల సభ్యులు ఉత్సాహపడుతున్నారు. ఒక్కోపోస్ట్కు పదుల సంఖ్యలో పోటీదారులు ఉండటంతో స్థానిక ఎమ్మెల్యేలు, ఆ నియోజకవర్గ బాధ్యులతో పార్టీ రాష్ట్ర బాధ్యులు సమన్వయం చేస్తున్నారు. ఈ మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జలవిహార్లో హైదరాబాద్ జిల్లా స్థాయి టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం మంగళవారం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
సంస్థాగత నిర్మాణంలో పార్టీ పదవులు దక్కించుకోవటానికి గులాబీల్లో పోటాపోటీ నెలకొన్నది. చురుకైన కార్యకర్తలు, నాయకులు, క్రియాశీలంగా వ్యవహరించే వారికే నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో పదవులు దక్కించుకునేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలతో సంప్రదింపులు జరుపుతూ సందడి చేస్తున్నారు.
సంస్థాగత నిర్మాణం కూర్పు ఎలా ఉండాలి? అనే అంశంపై పార్టీ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వార్డు స్థాయిలో ఏర్పడే కమిటీలో ఒక అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారితోపాటు ఆరుగురు కార్యవర్గ సభ్యులు మొత్తం 11మంది ఉండనున్నారు. పార్టీకి ఇప్పటికే ఉన్న అనుబంధ సంఘాలకు తోడు ఈసారి కొత్తగా సోషల్ మీడియా కమిటీని వేయనున్నారు. విద్యార్థి, కార్మిక, మహిళ, యువజన, రైతు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సోషల్ మీడియా అనుబంధ కమిటీలు ఉండనున్నాయి.
ప్రతి కమిటీకి 9 మంది చొప్పున 90 మంది ఉంటారు. వీటికితోడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 150 డివిజన్లతోపాటు ఇక్కడున్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని దాదాపు 1400పైచిలుకు బస్తీల్లో బస్తీ కమిటీలు, అనుబంధ కమిటీలు వేస్తుండటం విశేషం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళ ఈ వర్గాలు ప్రతీస్థాయి కమిటీల్లో 51 శాతానికి పైనే ఉండాలని, అలా లేని కమిటీలు చెల్లుబాటు కావని ఒకటికి రెండుసార్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో సంస్థాగత నిర్మాణ జోష్ కనిపిస్తున్నది.అనుబంధ కమిటీలు, రాష్ట్ర కమిటీ, రాష్ట్ర అనుబంధ కమిటీలు.. ఇలా ఏవిధంగా చూసినా పార్టీ క్రియాశీల సభ్యత్వం ఉన్న సభ్యుల్లో వారి వారి యోగ్యతలు, అభిరుచులు, అర్హతలు, అనుభవాన్ని బట్టి వందల సంఖ్యలో క్రియాశీలక పదవులకు అవకాశం ఉంది.