సిటీబ్యూరో, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : చిన్న, సన్నకారు రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ట్రిపులార్ బాధితులు కీలక నిర్ణయానికి సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను వేదికగా చేసుకుని ట్రిపులార్ ఆలైన్మెంట్తో ఎండగట్టాలనే యోచనలో ఉన్నారు. ఇందులో గతంలో పసుపు బోర్డు కోసం బీజేపీ ఎంపీ అర్వింద్ కుమార్కు వ్యతిరేకంగా నామినేషన్లు వేసిన రైతుల స్పూర్తితో… ట్రిపులార్ బాధితులు చట్ట సభలకు ప్రాతినిధ్యం వహిస్తే గానీ తమ బతుకులు మారే పరిస్థితి లేదని భావిస్తున్నారు.
ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వందలాది మంది రైతులు నామినేషన్లు వేయాలనే చర్చ ట్రిపులార్ బాధితుల్లో నడుస్తోంది.అడ్డగోలు మార్పులతో రైతులను నిండా ముంచుతున్న కాంగ్రెస్ సర్కారుకు ట్రిపులార్ బాధితుల నుంచి ఎదురు దెబ్బ తగిలేలా ఉంది. పెద్దల భూముల కోసం చిన్న రైతులను బలి చేసేలా మార్చిన ట్రిపులార్ ఆలైన్మెంట్ మార్పులకు నిరసనగా ఉత్తర భాగం ట్రిపులార్ సమాలోచనలు చేస్తున్నారు.
పాత ఆలైన్మెంట్ ఆధారంగా కాకుండా మార్పులతో వంకర్లు తిరిగిన ఆలైన్మెంట్ను నిలువరించాలంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఒకేసారి 200 మంది రైతులు నామినేషన్లు వేయాలని జేఏసీ సభ్యులు భావిస్తున్నారు. ఈ క్రమంలో రైతుల నుంచి కూడా అనూహ్య స్పందన రావడంతో అనుకున్నట్లుగా, రైతుల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో నిలిచి నిరసన తెలపనున్నారు. దీంతో అటు కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలోని రేవంత్ సర్కారు తమ ఆవేదన అర్థం కావాలంటే ఎన్నికల్లో పోటీ చేయడమే సరైన నిర్ణయంగా భావిస్తున్నారు.
ఆగని ఆందోళనలు..
పాత ఆలైన్మెంట్ కాకుండా స్వప్రయోజనాల కోసం వేలాది మంది రైతుల భూములపై కన్నేసిన కాంగ్రెస్ సర్కారు ఆలైన్మెంట్లో మార్పు లు చేసింది. దీనిపై ఇటీవల నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ రైతుల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలు దాటి మహానగరానికి వచ్చి ఆం దోళనలకు దిగుతున్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు.
ఆలైన్మెంట్ నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి 5సార్లు రోడ్డెక్కిన ట్రిపులార్ బాధితులకు… తాజా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ప్రధాన వేదికగా మార్చుకుని, తమ భూములను కాపాడుకోవాలని భావిస్తున్నారు. ఓవైపు ఆందోళనలు చేస్తూనే… మరోవైపు నామినేషన్లు దాఖాలు చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరాచకాలకు నిలువరించవచ్చనే అభిప్రాయం అటు రాజకీయ నిపుణుల్లో వ్యక్తం అవుతుంది. ఈ క్రమంలో రైతులు నిజంగా నామినేషన్లు వేస్తే గనుక పార్టీ పరువు మరింత దిగజారే అవకాశం ఉంటుందనీ అంచనా వేస్తున్నారు.