మొయినాబాద్, అక్టోబర్ 6: ఇంటర్ చదువుతున్న విద్యార్థి ఇన్ స్టాలో ట్రాప్ హౌస్ పార్టీ 9ఎంఎం అనే ఖాతా నిర్వహిస్తున్నాడు. ఆసక్తికరమైన ఆఫర్లు ఇన్‌స్టాలో పెట్టాడు. కొందరి మైనర్లను.. కొంత మంది మేజర్లను సోషల్ మీడియా ద్వారా ట్రాప్ చేసి పార్టీలో పాల్గొనే విధంగా ఊరించాడు. దీంతో ఇన్‌స్టాలో పరిచయం చేసుకున్నారు. మైనర్లు.. మేజర్లు ఆ యువకుడి ట్రాప్‌లో పడి టికెట్లు కొనుగోలు చేసి పార్టీకి హాజరయ్యారు. పార్టీలో పాల్గొంటే అంతులేని ఆనందం పొందవచ్చని మైనర్లకు ఎరవేశాడు.
ఆదివారం పార్టీకి హాజరై మత్తులో తూగుతుండగా, రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే దాడులు నిర్వహించి పరీక్షలు చేయగా ఇద్దరికి గంజాయి పాజిటివ్ వచ్చింది. వారి నుంచి విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. పార్టీ నిర్వాహకులను,ఫామ్ హౌస్ నిర్వాహకులను, డీజే ఆపరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన విద్యార్థి ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నాడు. ఇన్‌స్టా యాప్‌లో “ట్రాప్ హౌస్ 9ఎంఎం” పేరుతో ఖాతా నిర్వహిస్తున్నాడు. పెద్దమంగళారం గ్రామంలోని చెర్రీ ఓక్స్ ఫామ్‌హౌస్‌లో (ట్రాప్ హౌస్ పార్టీ) మత్తు పార్టీ నిర్వహిస్తున్నట్లు ఆసక్తికరమైన ప్రకటనలు గుప్పించాడు. ఈ పార్టీకి వచ్చిన వారు అంతులేని అనందాన్ని పొందవచ్చని ఇన్‌స్టాలో ఊరించాడు. మొత్తం 62 మంది పార్టీలో పాల్గొన్నారు.వారిలో మైనర్లు ఉన్నారు. అందులో 17 మంది యువకులు, 5 మంది యువతులు ఉన్నారు.
మొత్తం 62 మంది పార్టీలో పాల్గొన్నారు. శనివారం జరుపుకోవాల్సిన పార్టీకి ఆశించిన విధంగా మంది రాకపోవడంతో ఆదివారం పార్టీ నిర్వహించారు. 6 గంటల పాటు నిర్వహించే పార్టీలో పాల్గొనే వారు పాస్‌లు తీసుకోవాలని కండీషన్లు పెట్టారు.ఎర్లీ బర్డ్ టికెట్ రూ.1300లు నిర్ణయించగా, జనరల్ టికెట్ ఒకరికైతే రూ.1600, జంటగా వస్తే రూ.2800 రేట్ పెట్టారు. 50 మందికి మాత్రమే పాస్‌లు ఇవ్వడం జరుగుతుందని ఇన్‌స్టాలో పెట్టినా 59 మందికి టికెట్లు విక్రయించారు.
59 మంది వచ్చారు.ముగ్గురు నిర్వాహకులతో పాటు మొత్తం 62 మంది పార్టీలో పాల్గొన్నారు. రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది. ఆదివారం రాత్రి దాడులు నిర్వహించే సమయానికి అందరూ మత్తులో జోగుతున్నారు.పార్టీలో పాల్గొన్న 8 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించడంతో ఇద్దరికి గంజాయి పాజిటివ్ వచ్చినట్లుగా పోలీసులు తేల్చారు.పార్టీ నిర్వాహకుడు (విద్యార్థి), అబ్దుల్లా, ఓ మైనర్,ఫామ్ హౌస్ మేనేజర్ ఠాకూర్ మనీష్,ఫామ్ హౌస్ ఓనర్ శేషగిరిరావు, ఇద్దరు డీజే ఆపరేటర్లతో కలిసి 7 మందిని ఎస్వోటీ పోలీసులు అదుపులోనికి తీసుకుని మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు.