SPDCL | అవినీతికి చోటు లేకుండా ఎంతో పారదర్శకంగా బదిలీ ప్రక్రియను చేపడుతున్నామని, అందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి, వెబ్ కౌన్సెలింగ్‌ను ఎంప్లాయీస్ పోర్టల్ ద్వారా నిర్వహించామని ప్రకటించారు. బదిలీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మార్గదర్శకాలను లెక్క చేయకుండానే కొన్ని పోస్టులను తాము అనుకున్న వారికి అప్పగించేశారు. మొత్తంగా బదిలీల ప్రక్రియలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. బదిలీలతో అసంతృప్తికి గురైన కొందరు ఉద్యోగులు ఖైరతాబాద్‌లోని దక్షిణ డిస్కం కార్యాలయానికి వచ్చి ఉన్నతాధికారులను కలిసేందుకు ప్రయత్నించినా అందుబాటులో లేకుండా పో యారు.
తాజాగా సోమవారం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో జరిగిన బదిలీల ప్రక్రియలో మొత్తం 1126 మందిని బదిలీ చేసినట్లు డిస్కం అధికారులు ప్రకటించారు. ఇందులో డీఈలు 111, ఏడీఈలు 263, ఏఈలు 521, ఇతర ఉద్యోగులు 231 పోస్టులకు సంబంధించిన బదిలీల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. బదిలీ జాబితాను నేరుగా ఉద్యోగులకే మెయిల్ ద్వారా సందేశాలు పంపించి, బయటకు మాత్రం బహిర్గతం చేయలేదు. బదిలీల జాబితా బహిరంగంగా ప్రకటించాల్సిన అధికారులు తాము చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకే ఇలా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బదిలీల ప్రక్రియ చాలా పారదర్శకంగా జరిగిందని ప్రకటిస్తున్నా… తెరవెనుక మాత్రం విద్యుత్ శాఖ మంత్రి అనుచరులు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేసి నచ్చిన ప్రాంతానికి పోస్టింగ్ వచ్చేలా చేయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫోకల్ పోస్టుల్లో ఇప్పటి వరకు పనిచేసిన వారికి మళ్లీ ఫోకల్ పోస్టులకు బదిలీ చేయకుండా మార్గదర్శకాలను రూపొందించారు. ఈ నిబంధనలను తుంగలో తొక్కి కీలకమైన పోస్టుల్లో పనిచేసిన వారికి మళ్లీ అలాంటి కీలక పోస్టుల్లోనే పోస్టింగ్ ఇచ్చారు.
అందుకు ప్రత్యేక ఉదాహరణ కార్పొరేట్ కార్యాలయంలో డీఈ కమర్షియల్ ఈడీగా పనిచేస్తున్న అధికారిని మేడ్చల్ సర్కిల్ పరిధిలోని డీఈ ఆపరేషన్స్ పోస్టుకు బదిలీ చేశారు. ఇలా ఈ ఒక్క పోస్టు మాత్రమే కాదు.. పదుల సంఖ్యలోనే ఉన్నాయి. ఫోకల్ పోస్టుల్లో పోస్టింగ్‌కు రూ. 20 లక్షల నుంచి రూ. 80 లక్షల వరకు చేతులు మారినట్లు సమాచారం. ఈ బదిలీల్లో ఆ శాఖ మంత్రి అనుచరులు ఎక్కువగా ఒత్తిడి తీసుకువచ్చి 20 నుంచి 30 పోస్టుల వరకు పైరవీలు చేసినట్లు విద్యుత్ శాఖ ఉద్యోగులు పేర్కొంటున్నారు.
బదిలీల కోసం రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం విద్యుత్ ఉద్యోగ సంఘాల్లో నాయకులుగా ఉన్న వారికి ఫోకల్ పోస్టింగులు ఇవ్వకూడదు. కానీ తాజాగా జరిగిన బదిలీల్లో యూనియన్ నాయకులకు సైతం ఒకటి, రెండు చోట్ల పోస్టింగులు ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయంలోనూ సచివాలయం స్థాయిలో పైరవీలు చేసి, కావాల్సిన పోస్టును సొంతం చేసుకున్నారు.
బదిలీల కోసం రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం ఒకే డివిజన్లో పనిచేసిన వారికి అదే డివిజన్లో పోస్టింగ్ ఇవ్వకూడదు. కానీ ఆ నిబంధనను పట్టించుకోకుండా ఏడీఈ ఆపరేషన్ పటాన్చెరువు నుంచి ఏడీఈ ఆపరేషన్ గుమ్మడిదలకు బదిలీ చేశారు. ఇది ఒకే డివిజన్లో పరిధిలో ఉంది. మార్గదర్శకాలకు విరుద్ధంగా ఈ బదిలీల ప్రక్రియ జరిగిందనానికి ఇదొక సాక్ష్యం. అదేవిధంగా డీఈ ఆపరేషన్ మేడ్చల్ నుంచి డీఈ టెక్నికల్ మేడ్చల్ పోస్టు సైతం ఒకే సర్కిల్లో ఉంది.
ఈ పోస్టులు ఒకే సర్కిల్(మేడ్చల్)పరిధిలోని కావడం గమనార్హం. ఇలా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సర్కిళ్లు, డివిజన్ల, సెక్షన్లలో పరిధిలో జరిగిన బదిలీలు దక్షిణ డిస్కం రూపొందించిన బదిలీల మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నదని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఒకే డివిజన్లో 9 ఏండ్లుగా పనిచేస్తున్న అధికారిని అదే డివిజన్ పరిధిలోనే బదిలీ చేయడంపైనా పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్సీ పురం ఏడీఈని ఇస్నాపూర్ ఏడీఈగా బదిలీ చేయడాన్ని కొందరు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.