Traffic Restrictions | హైదరాబాద్ : వినాయక చవితి నేపథ్యంలో పాతబస్తీలోని ధూల్‌పేట్‌లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. వినాయక విగ్రహాలను కొనుగోళ్లు చేసేందుకు ఇప్పటికే ధూల్‌పేట్‌కు వాహనాలు బారులు తీరాయి. ఈ క్రమంలో ధూల్‌పేట్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడుతుంది. దీంతో ఆగస్టు 23 ఉదయం 7 గంటల నుంచి ఆగస్టు 27వ తేదీ రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.
బోయిగూడ కమాన్, గాంధీ విగ్రహం నుంచి వాహనాలను ధూల్‌పేట వైపునకు అనుమతించరు. వినాయక విగ్రహాలను తీసుకెళ్లే వాహనాలు గాంధీ విగ్రహం, పురానాపూల్, బోయిగూడ కమాన్ ఎక్స్ రోడ్డు నుంచి బయటకు వెళ్లాలని పోలీసులు సూచించారు.
గాంధీ విగ్రహం, పురానాపూల్ నుంచి వాహనాలను మంగళ్‌హాట్ వైపునకు మళ్లించనున్నారు. తక్కర్వాడి టీ జంక్షన్, జిన్సీ చౌరాహై, గోడే కే కబర్ వద్ద డైవర్ట్ చేయనున్నారు. సీతారాంబాగ్, దారుస్సలాం వైపు నుంచి వచ్చే వాహనాలను మంగళ్‌హాట్, పూరానాపూల్ వద్ద మళ్లించి, కార్వాన్ రోడ్డు, ఆఘపురా, దారుస్సలాం, అలస్కా, ఎంజే బ్రిడ్జి, జుమ్మెరాత్ బజార్ మీదుగా మళ్లించనున్నారు.
గణేశ్ విగ్రహాలను తరలించే భారీ వాహనాలను జుమ్మెరాత్ బజార్ గ్రౌండ్ వద్దనే పార్కింగ్ చేయాలని ఆదేశించారు. ఒక వేళ వర్షాలు పడి, ఇబ్బందులు తలెత్తితే ఎంజే బ్రిడ్జి నుంచి జుమ్మెరాత్ బజార్ రోడ్డులో సింగిల్ లైన్లో వాహనాల పార్కింగ్‌కు అనుమతించనున్నారు.