సిటీబ్యూరో: నగరంలో మద్యం తాగి వాహనాలు నడిపే వారికి చెక్ పెట్టడానికి పోలీసులు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 21 వరకు మొత్తం 4865 కేసులు నమోదైనట్లు ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. పోలీసుల చేతికి చిక్కిన మందుబాబుల్లో 2వేల మంది 21-30 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారే కావడం గమనార్హం. మరోవైపు పోలీసులు తాము అనుకున్న స్థాయిలో టార్గెట్ రీచ్ కాలేకపోయామని అంతర్గతంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం మందుబాబులు తనిఖీల నుంచి తప్పించుకోవడంలో ఆరితేరిపోయారని పోలీసులే చెబుతున్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్స్‌లో పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు మందుబాబులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట్లో తాము ప్రయాణించేదారిలో ఎక్కడైనా డ్రంక్ అండ్ డ్రైవ్ ఉందంటే వాహనాలు వెనక్కి తిప్పి జారుకునేవారు. అయితే పోలీసులు అటువంటి అవకాశం లేకుండా మూడు వైపులా దారి లేకుండా నాలుగో వైపు తాము ఉండి చెకింగ్స్ చేస్తుండడంతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతికారు. ఇందులో వాట్సాప్ గ్రూప్స్ ఎక్కువగా పనిచేశాయి.
అప్పట్లో హైడరాబాద్ సిటీలో ఏరియాల వారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ప్రతిరోజూ ఎక్కడికక్కడ చెకింగ్స్ అవుతున్నాయో పోస్ట్ చేసేవారు. మధ్యలో పోలీసులు వాటిపై కూడా నిఘా పెట్టడంతో కొన్ని రోజులు ఆగిపోయినా తిరిగి అవే గ్రూపులు కంటిన్యూ అవుతున్నాయని తెలుస్తోంది. గ్రూప్ సభ్యులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉండడంతో దాదాపు అన్ని ఏరియాలకు సంబంధించిన సమాచారం గ్రూపులో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుందని ఒక అధికారి చెప్పారు.
దీనివల్ల వాళ్లు తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు. కాగా, ట్రాఫిక్ పోలీసులు మందుబాబులతో ఎలాంటి సమస్య తలెత్తకుండా చెకింగ్ పాయింట్స్‌ను ముందుగానే పరిశీలించి ఎంపిక చేసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఇలాంటి ఏరియాలు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలో ఒక్కో పీఎస్‌కు ఐదు చొప్పున ఉన్నాయని వారు చెప్పారు. కాగా, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మొదలుకాగానే మందుబాబులు ఎవరికీ వారు మెసెజ్ చేసుకోవడంతో చాలామంది ఈ తనిఖీల నుంచి తప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది.