Hyderabad | సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): చలాన్ల కోసం ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహంతో వాహనదారుల ప్రాణాలు పోవడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమవుతున్నారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణను గాలికొదిలేసి.. గలు లేదు, రాత్రి లేదు.. చలాన్ల వసూళ్లే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై యమకింకరుల్లా వ్యవహరిస్తున్నారు. స్పీడ్ లిమిట్ బోర్డులుండవు.. సిగ్నల్ క్రాసింగ్ లైన్లు సక్కగా ఉండవు.. కొన్ని చోట్ల సిగ్నల్స్ సరిగ్గా పనిచేయవు. డివైటర్లకు రేడియం ట్రాఫిక్ క్రమబద్దీకరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
నగరంలో తలెత్తే ట్రాఫిక్ సమస్యనే మన ట్రాఫిక్ పోలీసుల పనితీరుకు నిలువెత్తు నిదర్శనం. కాని జరిమానాల వసూళ్లలో మాత్రం కోట్ల రూపాయలు వసూలు చేస్తూ నెంబర్‌వన్ స్థానంలో ఉంటారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాలు, ప్రమాదకరమైన మలుపులు, జంక్షన్లతో పాటు రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాలను నిలిపి, తనిఖీలు నిర్వహిస్తున్నారు.
అంతే కాకుండా ఇన్నర్ రింగ్‌రోడ్డుపైకి మధ్యాహ్నం నుంచి భారీ వాహనాలు ఎక్కువ సంఖ్యలో వస్తుండటంతో ప్రధాన ప్రాంతాలలో ఎక్కడికక్కడే ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతుంటాయి. ఈ ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించాల్సిన ట్రాఫిక్ పోలీసులు అది తమ పని కాదన్నట్టుగా కేవలం చాలన్ల వసూళ్లపైనే దృష్టి సారిస్తున్నారని వాహనాదారులు ఆరోపిస్తున్నారు.
పెండింగ్ చలాన్ల వసూళ్ల కోసం చౌరస్తాలు, ట్రాఫిక్ సిగ్నల్స్, నడిరోడ్లపై హఠాత్తుగా వాహనాలను ఆపేస్తూ ముక్కుపిండి చలానాలు చెల్లించాలని వేధిస్తున్నట్లు వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఒక పక్క ట్రాఫిక్ రద్దీలో ఇరుక్కొని ఇబ్బందులు పడుతుంటే, మరో పక్క ట్రాఫిక్ వసూళ్లకు వాహనాలను ఆపుతూ ట్రాఫిక్ సమస్య మరింత జఠిలంగా మారేందుకు ట్రాఫిక్ పోలీసులు కారణమవుతున్నారని వాహనదారులు మండిపడుతున్నారు.
భౌతిక జరిమానాలకే ఉత్సాహం…
ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారికి జరిమానాలు విధించాలి. జరిమానాలు విధించేందుకు వాహదారులను భౌతికంగా పట్టుకోనవసరం లేదు. వారి వాహన నెంబర్ ఉంటే చాలు. అంతే కాకుండా ఉల్లంఘనులను గుర్తించేందుకు రోడ్లపై ప్రత్యేక సీసీ కెమెరాలు ఉన్నాయి. అదీ కాకుండా ట్రాఫిక్ పోలీసుల చేతిలోనూ కెమెరాలు, సెల్ఫోన్లు, ట్యాబ్‌లు కూడా ఉన్నాయి. వీటి ద్వారా ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారులను గుర్తించి వారికి ఈ-చలానాలు విధించవచ్చు.
మితిమీరిన ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చార్జీషీట్లు కూడా దాఖలు చేసే వెసులుబాటు కూడా ఉంది. చట్టపరంగా ఇన్ని వెసులుబాట్లు ఉన్నప్పటికీ చాలా మంది ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఒంటిపై యూనిఫామ్ ఉందికదా అని చట్ట విరుద్ధంగానే వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రై కమిషనరేట్ల పరిధిలోని చాలా మంది ట్రాఫిక్ పోలీసులు భౌతిక చలానాలు విధించేందుకే ఉత్సాహం చూపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇందుకోసం డ్రైవింగ్‌లో ఉన్న వాహనదారులను హఠాత్తుగా ఆపడం, ఆపిన వెంటనే వాహనాల తాళాలు లాక్కోవడం, వాహనలను బలవంతంగా స్టేషన్లకు తరలించి సీజ్ చేయడం వంటి తీవ్ర చర్యలకు పాల్పడుతున్నారు. ఈ చర్యలన్నీ పూర్తిగా చట్టవిరుద్ధమని పలు మార్లు న్యాయస్థానాలు హెచ్చరించినా పోలీసుల తీరులో మార్పు రావడం లేదని వాహనదారులు విమర్శిస్తున్నారు.
చలాన్ల కోసం ప్రాణాలు తీస్తారా…
ఇదిలా ఉండగా మరికొంత మంది ట్రాఫిక్ పోలీసులు మరో అడుగు ముందుకేసి వాహదారులపై దాడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో వనస్థలిపురం వద్ద వాహనాలు తనిఖీలు జరుపుతున్న ట్రాఫిక్ పోలీసులు తమను చూసి వేగంగా పారిపోతున్న ద్విచక్రవాహనదారుపై లాఠీ విసిరేయడంతో అది మరో వాహనంపై వెళ్తున్న ఒక వృద్ధుడికి తగిలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సదరు వృద్ధుడు కిందపడి దుర్మరణం చెందడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది.
2010లో అబిడ్స్‌లోని హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు తమను చూసి పారిపోతున్న ఒక వాహనదారుడిని పట్టుకునే క్రమంలో అతడి వాహనాన్ని పట్టుకుని లాగడంతో సదరు వాహనదారుడు కిందపడి మృత్యువాత పడ్డాడు. మరో ఘటనలో ట్యాంక్‌బండ్‌పై 2011లో వాహనాలు తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని ఆపకుండా వెళ్తున్న వ్యక్తి వాహనాన్ని పట్టుకుని లాగడంతో సదరు వాహనదారుడు కిందపడి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.
2013లో మరో ఘటనలో ఎల్బీనగర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న ఒక ఎస్ఐ జరిమాన చెల్లించేందుకు నిరాకరించిన వాహనదారుడిపై హెల్మెట్‌తో తలపై దాడి చేయడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ తరహా ఘటనలతో పలు మార్లు న్యాయస్థానం వాహనాల తనిఖీలు, జరిమానాలు విధించడం, వసూళ్లు చేయడంపై చట్టపరిధిలో ఉన్న నియమాలు పాటించాలని హెచ్చరించినా పోలీసుల తీరులో మార్పు రావడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా బాలానగర్ ఘటనలో జోష్ బాబు అనే వాహనదారుడి మరణానికి స్థానిక ట్రాఫిక్ పోలీసులు కారణమయ్యారని బాధిత కుటుంబ సభ్యులు, ఘటనా స్థలంలో ఉన్న వాహనదారులు ఆరోపిస్తున్నారు.
మద్యం మత్తులో కానిస్టేబుల్…?
బాల్నగర్ ఘటనలో వాహనదారుడుల జోష్‌బాబు మృతికి కారణమైన కానిస్టేబుల్ గోపాల్ మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు, మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు బాలానగర్ పోలీసులు కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసి, వైద్యపరీక్షల నిమిత్తం గోపాల్‌ను దవాఖానకు తరలించినట్లు బాలానగర్ అదనపు డీసీపీ సత్యనారాయణ తెలిపారు.
నిండు ప్రాణం తీసిన కానిస్టేబుల్ అత్యుత్సాహం
బాలానగర్ ఐడీపీఎల్ కాలనీ గేటు వద్ద వాహనాల తనిఖీలు చేస్తున్న బాలానగర్ ట్రాఫిక్ పోలీసులు జీడిమెట్ల వైపు నుంచి ద్విచక్రవాహనంపై వస్తున్న జోష్‌బాబు వాహనాన్ని గోపాల్ అనే కానిస్టేబుల్ ఆపాడు. దీంతో వాహనాన్ని ఆపి, పక్కకు తీసుకున్న వాహనదారుడు తిరిగి వెళ్లేందుకు యత్నించాడు. దీంతో పక్కనే ఉన్న కానిస్టేబుల్ గోపాల్ జోష్‌బాబును పట్టుకుని లాగడంతో అతను అదుపు తప్పి కిందపడిపోయాడు.
అదే సమయంలో అటుగా వచ్చిన ఆర్టీసి బస్సు జోష్‌బాబు తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. దీంతో అక్కడే ఉన్న వాహనదారులు, స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలికి చేరుకుని పోలీసుల తీరుకు నిరసనగా ఆందోళనకు దిగారు. వాహదారుడి మృతికి కారణమైన కానిస్టేబుల్ గోపాల్‌కు దేహశుద్ధి చేసేందుకు యత్నించగా అప్పటికే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకు దిగిన వాహనదారులు, స్థానికులపై లాఠీలు జుళిపించి వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు.