హైదరాబాద్: హైదరాబాద్‌లో నేడు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం సూచించింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆఫీసులు, వ్యాపారాలు, కాలేజీలు, స్కూళ్లకు వెళ్లేవారికి పోలీసులు పలు సూచనలు చేశారు. వర్షం నిలిచిన వెంటనే వాహనదారులు రోడ్లపైకి రావద్దని చెప్పారు. వర్షం ఆగిన గంట తర్వాత రహదారులపైకి రావాలని సూచించారు. దీనివల్ల ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కోకుండా ఉండవచ్చని తెలిపారు. రోడ్లపై నెమ్మదిగా వెళ్లాలని చెప్పారు.
షియర్ జోన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు, రేపు ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, నగరంలో అక్కడక్కడా భారీ వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది.
నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురిసింది. లంగర్‌హౌస్, గోల్కొండ, కార్వాన్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, రాయదుర్గం, గచ్చిబౌలి, ఫిలింనగర్, పంజాగుట్ట, కూకట్పల్లి, నాచారం, మల్లాపూర్, ఈసీఐఎల్, చర్లపల్లి, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, రామంతపూర్, ఉప్పల్, బోడుప్పల్, పిర్జాదీగూడ, మేడిపల్లి, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, వనరస్థలిపురం, హయత్‌నగర్, తుర్కయంజాల్, ముషీరాబాద్, చిక్కడపల్లి, విద్యానగర్, రాంనగర్, సికింద్రాబాద్ స్టేషన్, కాచిగూడ, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. ఒక్కసారిగా భారీ వర్షం కురియడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.