ఖైరతాబాద్, మే 21: ఇక్కడ బండ్లు ఎవడు పెట్టుకోమన్నాడు. ఇది మీడియా పాయింట్ అయితే ఏంది…. తీసేయ్ అంటూ జర్నలిస్టులపై ఓ ట్రాఫిక్ సీఐ బెదిరింపులకు దిగాడు. ప్రభుత్వం అధికారికంగా మీడియా కోసం కేటాయించిన స్థలంలోనే వాహనాలు పెట్టుకున్నామంటే కూడా వినకుండా దురుసుగా ప్రవర్తించాడు. సచివాలయం మీడియా పాయింట్ సాక్షిగా ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు.. బుధవారం తమ విధుల్లో భాగంగా జర్నలిస్టులు సెక్రటేరియేట్ మీడియా పాయింట్ వద్దకు వచ్చారు. అక్కడే ఎదురుగా వాహనాలు పార్కింగ్ చేశారు.
అంతలోనే అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ సీఐ భాస్కర్ ఈ బండ్లు ఎవడు పెట్టుకోమన్నాడు…తీసివేయాలంటూ గద్దించాడు. ఇది తమ కోసం ప్రభుత్వం కేటాయించిన మీడియా పాయింట్ అని, కేటాయించిన స్థలంలోనే వాహనాలు పెట్టుకున్నామని, తమకు ఇదొక్కటే పార్కింగ్ ఉందని పలువురు జర్నలిస్టులు చెబుతున్నా వినకుండా మీడియా పాయింట్ ఐతే ఏందీ… తీసి పారేయండంటూ వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా పలువురు జర్నలిస్టులపై చేయి వేసి నెట్టివేశాడు.
గత కొంతకాలంగా సదరు సీఐ జర్నలిస్టుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా మీడియా పాయింట్ వద్ద పార్కింగ్ చేసిన వాహనాలను ఫొటోలు తీస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని పలువురు జర్నలిస్టులు తెలిపారు. నిత్యం ముఖ్యమంత్రి సహా, మంత్రులు, ఉన్నతాధికారుల ప్రెస్మీట్లు, మీడియా కాన్ఫరెన్స్‌ల కవరేజీ కోసం వచ్చే తమపై సీఐ ప్రవర్తన మీడియా హక్కులకు భంగం కలిగించడమేనంటున్నారు. సీఐపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.