మారేడ్‌పల్లి, సెప్టెంబర్ 10: సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ ఆవరణలోని కంటోన్మెంట్ బోర్డు స్థలంలో ఉన్న పలు వ్యాపార సముదాయాలు (షెడ్లను) బుధవారం కంటోన్మెంట్ బోర్డు అధికారులు, ఇంజినీర్లు కూల్చివేశారు. బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు నడుమ ఉదయం 6 గంటలకు జేసీబీ సహాయంతో బోర్డు స్థలంలో ఉన్న వ్యాపార సముదాయాల షెడ్లను తొలగించారు. జేబీఎస్ బస్టాండ్‌కు ఆనుకొని ఉన్న నాలా పక్కనే దుకాణాల సముదాయాలు నిర్మించి.. వ్యాపార లావాదేవీలు కొన్నాండ్ల నుంచి పలువురు వ్యాపారులు కొనసాగిస్తున్నారు.
2015లో కంటోన్మెంట్ స్థలంలో ఉన్న ఈ వ్యాపార సముదాయాలను తొలగించేందుకు ప్రయత్నించగా, పలువురు వ్యాపారస్తులు కోర్టును ఆశ్రయించగా కోర్డు స్టే ఆర్డర్ ఇచ్చింది. అప్పటి నుంచి బోర్డు అధికారులు అటు వైపు కన్నెత్తి చూడలేదు. ఇటీవల ఆ స్టే ఆర్డర్ తొలిగిపోవడంతో బుధవారం ఉదయం బోర్డు సీఈవో మధుకర్ నాయక్, ఇంజినీర్లు ఫణికుమార్, ఉమాశంకర్, దినేష్, శానిటేషన్ సూపరింటెండెంట్ మహేందర్, బోర్డు సిబ్బంది పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు.
30 ఏండ్లుగా..
జేబీఎస్ బస్టాండ్ పక్కనే ఉన్న బోర్డు స్థలంలో (టిఫిన్ సెంటర్లు, టీ స్టాల్స్, జ్యూస్ పాయింట్లు, పాన్ డబ్బాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు) సుమారు 30 వ్యాపార సముదాయాలు కొనసాగుతున్నాయి. బోర్డు అధికారులు కూల్చివేతలు చేపడుతున్న విషయం తెలుసుకున్న పలువురు వ్యా పారులు.. ఘటనా స్థలానికి చేరుకొని కొద్ది సేపు ఆందోళన చేపట్టారు. వెంటనే వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అనంతరం పలువురు వ్యాపారస్తులు మాట్లాడుతూ…తమ పై కక్ష సాధింపు చర్యలతోనే ఈ కూల్చివేతలు చేపట్టినట్లు తెలిపారు. సుమారు 30 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో వ్యాపారాలు చేసుకుంటూ.. జీవనం కొనసాగిస్తున్నామని, ఒక్కసారిగా ఇలా వచ్చి కూల్చివేయడంతో తాము ఎలా బతకాలంటూ ప్రశ్నించారు. సుమారు 90కి పైగా కుటుంబాలకు పైగా రోడ్డున పడ్డాయని పలువురు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.