హిమాయత్ నగర్, ఏప్రిల్ 14: సమాజ వికాసానికి విద్య ఎంత గానో దోహదపడుతోందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్ అన్నారు. పేద విద్యార్థులను వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని కోరారు. పాలిసెట్ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న ప్రభుత్వ స్కూళ్లకు చెందిన విద్యార్థులకు తపస్, యూత్ ఫర్ సేవా సంయుక్త ఆధ్వర్యంలో నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ హైస్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రణాళికబద్ధంగా చదివితే పాలిసెట్లో సులభతరంగా సీటు సాధించే అవకాశం ఉంటుందని తెలిపారు. గత 15 ఏండ్లుగా పాలిసెట్ ప్రవేశ పరీక్ష కోసం పేద విద్యార్థులకు ఆన్లైన్లో ఉచిత శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ జీవితంలో స్థిరపడి, సమాజానికి సేవలు అందించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.