హైదరాబాద్ : బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్న అశోక్.. ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా అశోక్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఇంటి నిర్మాణ అనుమతి కోసం సరూర్‌నగర్‌కు చెందిన ఏ దేవేందర్ రెడ్డి అశోక్‌ను సంప్రదించాడు. మధ్యవర్తి శ్రీనివాస్ రాజు(ప్రయివేటు ఆర్కిటెక్చర్) ద్వారా అశోక్ రూ. 30 వేలు లంచం డిమాండ్ చేయడంతో బాధిత వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఇవాళ అశోక్ లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. అశోక్‌తో పాటు శ్రీనివాస్ రాజును కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంతో పాటు అశోక్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగించారు.
అయితే అశోక్ బుల్లెట్ బండి ఫేమ్‌గా గుర్తింపు పొందారు. ఆయన పెళ్లి డ్యాన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. 2021, ఆగస్టు 14న మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన యువతితో రామక్రిష్ణాపూర్‌కు చెందిన ఆకుల అశోక్ వివాహం జరిగింది. అప్పగింతల సమయంలో వధువు.. బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా.. అనే పాటకు చేసిన డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అన్ని సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. యూట్యూబ్‌లో కోట్ల వ్యూస్ వచ్చాయి.