Tonic Wines | జూబ్లీహిల్స్, సెప్టెంబర్ 1: జూబ్లీహిల్స్‌లోని టానిక్ వైన్స్‌ను ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదివారం మూసివేశారు. ఆగస్టు 31తో ఈ వైన్స్ లైసెన్స్ గడువు ముగిసింది. అయితే, లైసెన్స్ పునరుద్ధరణకు చేసిన దరఖాస్తును ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తిరస్కరించడంతో సంబంధిత వైన్స్ మూసివేత అనివార్యమైంది. ఈ మేరకు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కేఏబీ శాస్త్రి, అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించారు.
ఇందులో భాగంగా స్టేషన్ హౌస్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు సమక్షంలో అధికారుల స్టాక్‌ను లెక్కించి వైన్స్‌ను సీజ్ చేశారు. ఈ వైన్స్‌లో రూ.1.50 కోట్లకు పైగా విలువైన మద్యం నిల్వ ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. ఆయా మద్యం నిల్వలను ఇతర షాపులకు తరలించనున్నట్లు అధికారులు వెల్లడించారు. గతంలో ఈ వైన్స్‌పై నమోదైన కేసులతో ఈ మూసివేత చర్యకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.