Thammareddy Bharadwaja | గత పదేండ్లలో హైదరాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధిని చూస్తే కేసీఆర్ ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే అంటున్నారు సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్. హైదరాబాద్‌తో తనకు ఉన్న అనుబంధం, నగరం అభివృద్ధి చెందుతున్న తీరు గురించి ‘నమస్తే తెలంగాణ’తో తమ్మారెడ్డి తన అభిప్రాయాలను పంచుకున్నారు.
కూడు, గూడు, గుడ్డ.. ఈ మూడింటికీ ఢోకా లేకపోతే గౌరవంగా బతుకుతున్నట్టే. ఈ మూడింటినీ ప్రజలకు అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం చాలా కృషి చేసింది. పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇవ్వడం, మంచినీటి కొరతను తీర్చి సామాన్య ప్రజలకు తాగునీటి గోసను తీర్చడం వంటి మంచి పనులను కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ముఖ్యంగా ఈ పదేండ్లలో హైదరాబాద్ నగరం చాలా అభివృద్ధి చెందింది. కరోనా సంక్షోభ సమయంలో రోడ్లు నిర్మానుష్యంగా మారినప్పుడు.. దానినే అదనుగా తీసుకొని అద్భుతమైన కొత్త రోడ్లను నిర్మించిన కేసీఆర్ ప్రభుత్వాన్ని, ఇందుకు కృషి చేసిన మంత్రి కేటీఆర్‌ను అభినందించకుండా ఉండలేం. హైదరాబాద్ లాంటి మహానగరంలో ట్రాఫిక్‌ను నియంత్రించడం అంత తేలిక కాదు. అయినా, ప్రభుత్వం ఈ విషయంలో సక్సెస్ అవుతున్నది. నగరంలో కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్లు, రోడ్లు, ఆర్వోబీలు, ఆర్‌యూబీలు చూసి ఆశ్చర్యపోతుంటాను. నగరంలో డ్రైనేజీ, నాలాల సమస్యలు ఉండేవి. కేసీఆర్ ప్రభుత్వం డ్రైనేజీ, నాలా వ్యవస్థలను ప్రక్షాళన చేస్తూ సమస్యలను పరిష్కరిస్తుండటం సంతోషకరం. నేను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను. ఇప్పుడు మన నగరం ఇంతలా అభివృద్ధి చెందుతూ ఉండటం చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నది. రోమ్‌లో బతికేవాడు రోమన్‌లా బతకాలి అంటారు. అలాగే హైదరాబాద్‌లో జీవించే వారంతా ఎలాంటి సమస్యలు లేకుండా తెలంగాణ బిడ్డలుగానే జీవిస్తున్నారు.