సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డుపై టోల్ చార్జీలు పెరుగనున్నాయి. కొత్త వార్షిక సంవత్సరమైన ఏప్రిల్ 1-2024 నుంచి మార్చి 31, 2025 వరకు అమల్లో ఉండేలా ధరలను పెంచాల్సి ఉన్నా, దేశ వ్యాప్తంగా ఎన్నికలు ఉండడంతో టోల్ చార్జీలను పెంచలేదు.
ఎన్నికల ప్రక్రియ జూన్ 1న ముగియడంతో 3వ తేదీ నుంచే టోల్ చార్జీలను పెంచుతున్నామని ఓఆర్ఆర్ నిర్వహణ సంస్థ ఐఆర్బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ ఆదివారం ప్రకటించింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతియేటా పెంచే టోల్ చార్జీల నిబంధనల మేరకు ఓఆర్ఆర్పై కొత్త టోల్ చార్జీలు అమలు చేయనున్నారు. నగరం చుట్టూ 158 కి.మీ పొడవునా ఉన్న ఓఆర్ఆర్పై 22 చోట్ల ఇంటర్‌చేంజ్‌లు ఉన్నాయి.