సిటీబ్యూరో, జూలై 27, (నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా 40 మిలియన్ల మంది దీర్ఘకాలిక హెపటైటిస్ బీ తో, 12 మిలియన్ల మంది హెపటైటిస్ సీతో బాధపడుతున్నట్లు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ వ్యాధిని ఆదిలోనే అంతం చేయడం అత్యంత అవసరం. ప్రతి ఏటా హెపటైటిస్ భారిన పడకుండా అవగాహన కల్పించేందుకు జూలై 28న వరల్డ్ హెపటైటిస్ డేను నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా ‘హెపటైటిస్‌ను ఛేదిద్దాం’ అనే థీమ్‌తో నివారణ చర్యలపై దృష్టి సారించాలని పిలుపునిస్తున్నారు.
హెపటైటిస్ వల్ల ఏటా 10 లక్షల మంది మరణిస్తున్నారు. మరణించిన వాళ్లలో 55 ఏళ్లలోపు ఉన్నవారే అధికంగా ఉండటం ఆందోళనను కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మరణించినవాళ్లలో 87 శాతం మంది హెపటైటిస్ బీ కారణంగా చనిపోగా, 17 శాతం మంది హెపటైటిస్ సీ వల్ల మృతిచెందారు. మొత్తం హెపటైటిస్ రోగుల్లో 2.4 శాతం హెపటైటిస్ బీ తో , 2.8 శాతం మంది హెపటైటిస్ సీ తో బాధపడుతున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడించాయి.
వైరల్ హెపటైటిస్ ఐదు రకాలుగా వ్యాపిస్తుంది. వాటిలో హెపటైటిస్ ఏ,ఈ లు కలుషిత ఆహారం లేదా నీరు తాగడం వల్ల వ్యాపించగా, హెపటైటిస్ బీ, సీ లు రక్తం, శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తాయి. హెపటైటిస్ బీ ఉన్నవారికి మాత్రమే హెపటైటిస్ డీ వస్తుంది. అధిక మోతాదులో మద్యం తాగడం వల్ల కాలేయ కణాలు దెబ్బతిని దీర్ఘకాలంలో సిర్రోసిస్‌కు దారితీస్తుంది. ఆల్కాహల్ తీసుకోని వారిలో ఎక్కువ బరువు, మధుమేహం, అధిక కొలస్ట్రాల్ ఉన్నవారిలో కూడా ఈ వ్యాధి తరచూ వస్తుంటుంది. మహిళల్లో ఎక్కువగా ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ వల్ల కాలేయాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేస్తుంది. కొన్ని మెడిసిన్లు, ఆయుర్వేద సప్లిమెంట్లు సైతం కాలేయంపై విష ప్రభావం చూపుతాయి.
ఏడాది పిల్లలను నుంచి మొదలు 18 ఏండ్ల్ల వరకు హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ రెండు లేదా మూడు డోసులు వేయించుకోవాలి. పెద్దవాళ్లు వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న ఆరు లేదా పన్నెండు నెలల తరువాత బూస్టర్ డోస్ తీసుకోవడం తప్పనిసరి. హెపటైటిస్ ఏ, ఈ వాటంతటే అవే నయం అవుతాయి.. హెపటైటిస్ బీ, సీ లు మాత్రం మందులతో నయం చేయాల్సిందే.
హెపటైటిస్ వ్యాక్సిన్ 15 నుంచి 20 ఏండ్ల పాటు మనకు రక్షణ కవచంగా పనిచేస్తుంది. నేషనల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాం హెపటైటిస్ బీ వ్యాక్సిన్ వేస్తారు. మద్య రహిత ఫ్యాటీ లివర్ వ్యాధి సైతం ప్రస్తుత రోజుల్లో అధికమవుతున్నది. జీవన శైలిలో మార్పులు రావడం అత్యంత ముఖ్యం. స్థూలకాయాన్ని తగ్గించేందుకు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం.
– డాక్టర్ శ్రీకాంత్ అప్పగాని, గ్యాస్ట్రోఎంటరాలజిస్టు, కిమ్స్ హాస్పిటల్
హెపటైటిస్ వ్యాక్సిన్ వేసుకోవడంతో పాటు, వ్యక్తిగత వస్తువులు పంచుకోవద్దు, చేతులు తరుచూ కడుక్కోవాలి. షుగర్ నియంత్రణలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అనుమానాలు ఉంటే వైద్యున్ని సంప్రదించి..పరీక్షలు చేయించుకోవాలి. వైద్యున్ని సంప్రదించకుండా మెడిసిన్ వాడినా ప్రమాదకరమే.
– డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, హెపటాలజిస్ట్, స్టార్ హాస్పిటల్