సిటీబ్యూరో, ఏప్రిల్11(నమస్తే తెలంగాణ): నగరంలో శనివారం జరిగే హనుమాన్ విజయోత్సవ యాత్రకు 20వేల మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. సీసీ కెమెరాలతో పాటు డ్రోన్లతో నిఘా ఉంటుందని, హైదరాబాద్ సిటీ పరిధిలో 150, రాచకొండ, సైబరాబాద్‌ల నుంచి వచ్చే46 ర్యాలీలు ఈ యాత్రలో కలుస్తాయని ఆయన పేర్కొన్నారు. వీరహనుమాన్ విజయోత్సవ ర్యాలీని ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆయన నిర్వాహకులకు సూచించారు.
గౌలిగూడ శ్రీరామమందిరం నుంచి తాడ్‌బండ్ హనుమాన్ దేవాలయం వరకు సుమారు 12.2 కిలోమీటర్ల మేర యాత్ర జరగనున్నదని, ఉదయం 11 గంటలకు యాత్ర ప్రారంభమై రాత్రి 9గంటలకు ముగుస్తుందని, పుత్లిబౌలి, కోఠి, సుల్తాన్‌బజార్, నారాయణగూడ, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ అశోక్‌నగర్, గాంధీనగర్, కవాడిగూడ, బైబిల్‌హౌజ్, రాంగోపాల్‌పేట, ప్యారడైజ్ ప్రాంతాల మీదుగా యాత్ర జరుగుతుందని పోలీసులు తెలిపారు. విజయయాత్ర సందర్భంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ ఒక ప్రకటనలో వెల్లడించారు.