Khairatabad Ganesh | ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి నేటి నుంచి నవరాత్రుళ్లు భక్తులకు దర్శనమివ్వనున్నారు. 70 ఏండ్ల ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రస్థానంలో తొలిసారి 70 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పైన మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. స్వామి వారికి రెండు వైపుల అయోధ్య శ్రీబలరాముడు, రాహు, కేతులతో పాటు శ్రీ లక్ష్మీ శ్రీనివాసుడు, పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను భక్తులకు కనువిందు చేయనున్నాయి. నవరాత్రోత్సవాలకు ఉత్సవ కమిటీతో పాటు పోలీసు శాఖ, జీహెచ్ఎంసీ సకల ఏర్పాట్లు కల్పించాయి.
నేడు వినాయకచవితి సందర్భంగా స్వామి వారి విగ్రహా ప్రాణప్రతిష్ఠాపన పూజలు ఉదయం 8గంటల నుంచే ప్రారంభం కానున్నాయి. ఖైరతాబాద్ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో స్వామి వారికి 75 అడుగుల కండువ, జంధ్యం, గరికమాలను సమర్పించనున్నారు. పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలతో అలంకరిస్తారు. కాగా, ఖైరతాబాద్ మహాగణపతికి ప్రతి ఏడాది దశాబ్దాలుగా గవర్నర్ తొలిపూజ నిర్వహించే ఆనవాయితీ కొనసాగుతున్నది. ఈ ఏడాది మొదటి సారి సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి తొలిపూజకు హాజరుకానున్నారు. సాయంత్రం 3గంటల ప్రాంతంలో తెలంగాణ గవర్నర్ హాజరవుతారని ఉత్సవ కమిటీ తెలిపింది.