రవీంద్రభారతి, డిసెంబర్ 30: ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చడానికి తన మంత్రి పదవినైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర మత్య్సశాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ముదిరాజ్ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సన్మాన సభ మంగళవారం రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి వాకిటి శ్రీహరి,మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర చాలా కీలమైనదన్నారు. ఇటీవలి స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు .. భవిష్యత్‌లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలుపొందాలని ఆకాంక్షించారు.
ముదిరాజ్‌ల ఆలోచన విధానంలో మార్పు వచ్చిందంటే సర్పంచ్‌లే నిదర్శనమన్నారు. పండుగ సాయన్న , కానిస్టేబుల్ కిష్ణయ్య ఉద్యమ స్పూర్తితో మహాత్మా జ్యోతిరావ్‌పూలే ఆలోచన విధానంతో, అంబేద్కర్ ఇచ్చిన వాటాతో రాజకీయంగా ముదిరాజ్‌ల అభివృద్ధికి కృషిచేయాలన్నారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. సర్పంచ్‌గా అందరికి అవకాశం రాదని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, కాసాని వీరేష్ ముదిరాజ్‌తోపాటు వివిధ జిల్లాలకు చెందిన ముదిరాజ్ ప్రతినిధులు పాల్గొన్నారు.