Charminar | చార్మినార్, ఫిబ్రవరి 13 : సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు డిజిటల్ శిక్షణ అందించేందుకు సిటీ కాలేజీ టీఎన్ఎస్ ఇండియా ఫౌండేషన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది. విద్యా ప్రణాళికలు, పరిశ్రమ అవసరాల మధ్య అంతరాన్ని తగ్గించి, విద్యార్థులను సిద్ధం చేసేందుకు ఈ శిక్షణ రూపొందించింది. ఇందులో భాగంగా ఫౌండేషన్ ప్రతినిధులు బీకాం, బీబీఏ విద్యార్థులకు గత నవంబర్ నుంచి 200 గంటల డిజిటల్ శిక్షణ అందించామని సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బాల భాస్కర్ పేర్కొన్నారు. ఒప్పందంలో భాగంగా కళాశాలలో బీబీఏ విద్యార్థులకు ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించారు.
నియో గ్లోబల్ సోల్యూషన్స్, మహీంద్రా ఫైనాన్స్, ఐ ప్రాసెస్, యాక్సిస్ బ్యాంక్ తదితన 13 సంస్థలు ఈ డ్రైవ్‌లో పాల్గొన్నాయి. మూడు రౌండ్లుగా జరిగిన ఇంటర్వ్యూల్లో కళాశాలకు చెందిన 55 మంది విద్యార్థులు ఆఫర్ లెటర్లు అందుకున్నారని ప్రిన్సిపాల్ బాల భాస్కర్ తెలిపారు. ఇదే తరహాలో మిగిలిన విద్యార్థులకు కూడా దశలవారీగా శిక్షణ ఇప్పించనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ ఇవ్వడంతో పాటు ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించిన టీఎన్ఎస్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధులు దీపక్ కాంబ్లే, ప్రోగ్రామ్ మేనేజర్ రంగిణికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శిక్షణ కార్యక్రమాన్ని, ప్లేస్మెంట్ డ్రైవ్‌ను సమన్వయం చేసిన కామర్స్ విభాగ అధ్యక్షుడు డాక్టర్ కే మల్లికార్జున రావు, డాక్టర్ ఝాన్సీ రాణిని అభినందించారు.