శేరిలింగంపల్లి, డిసెంబర్ 14: టిప్పర్ వాహనం ఓ ద్విచక్ర వాహాన్ని ఢీకొట్టిన ప్రమాదంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజిర్ మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డ ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఖమ్మం జిల్లా, ఉప్పలపాడు, లక్ష్మీనర్సింహాపురం గ్రామానికి చెందిన చల్లా లోహిత్(24) ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. సమీపంలో గౌలిదొడ్డిలోని జగన్‌రెడ్డి మెన్స్ పీజీ హాస్టల్లో నివసిస్తున్నాడు. లోహిత్ శుక్రవారం అర్ధరాత్రి సమయంలో స్నేహితుడు బీహెచ్ఈఎల్ ప్రాంతానికి చెందిన రావిపూడి సాయి మహేశ్‌బాబు(24)తో కలిసి ద్విచక్ర వాహనంపై ప్లిఫ్సైడ్ రెస్టారెంట్ వైపు నుంచి ఐసీఐసీఐ టవర్స్ వైపు వెళ్తున్నారు.
మార్గమధ్యలో అన్వయ కన్వెన్షన్ సమీపంలో గౌలిదొడ్డి వైపు నుంచి ఔటర్ సర్వీస్‌రోడ్డు వైపు వెళ్తున్న టిప్పర్ వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో లోహిత్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందగా.. మహేశ్‌బాబు తీవ్రగాయాలకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం మహేశ్‌బాబును సమీపంలోని కాంటినెంటల్ హాస్పిటల్‌కు తరలించారు. లోహిత్ మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించి మృతుడి అన్న చల్లా నవనీత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, టిప్పర్ నిర్లక్ష్యంగా దూసుకువచ్చి బైక్‌ను ఢీకొట్టినట్లు పోలీసులు వెల్లడించారు.