దుండిగల్, ఫిబ్రవరి 23: ఎదురు ఎదురుగా వస్తున్న టిప్పర్, కారు ఢీకొన్న సంఘటనలో కార్ డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ బౌరంపేట స్నేక్ పార్క్ వద్ద ఆదివారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లికి చెందిన పున్నాల నాగ వంశీ(22) అనే యువకుడు ఆదివారం ఉదయం కారులో మియాపూర్ వైపు నుంచి గండిమైసమ్మ చౌరస్తా వైపు వస్తుండగా గండి మైసమ్మ చౌరస్తా వైపు నుంచి ప్రగతి నగర్ వైపు వెళ్తున్న టిప్పర్ ఎదురుగా వేగంగా చూసుకు వచ్చి బౌరంపేట లోని బ్రేక్ పార్క్ వద్ద కారు ఢీ కొట్టింది.
దీంతో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు కావడంతో కారు క్యాబిన్లో ఇరుక్కుని నాగ వంశీ అక్కడికక్కడే దుర్మరణం చెందా డు. అదే సమయంలో కారు వెనకాలే వస్తున్న చక్రవాహనం (బుల్లెట్) అదుపుతప్పి కింద పడడంతో బైక్ నడుపుతున్న బాచుపల్లి కి చెందిన చిత్తూరి వెంకట సురేంద్ర కాలి కి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రుడు వెంకట సురేంద్రను చికిత్స కోసం సూరారంలోని మల్లారెడ్డి వైద్యశాలలో చేర్పించారు. కేసు దర్యాప్తులో ఉంది.