సిటీబ్యూరో, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ): ఈనెల 12న జరగనున్న శ్రీ వీరహనుమాన్ విజయయాత్ర(శోభాయాత్ర) సందర్భంగా మంగళవారం హైదరాబాద్ పోలీస్ అధికారులతో సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతంలో జరిగిన విజయయాత్ర సందర్భంగా జరిగిన సంఘటనలు, బందోబస్త్ ఏర్పాట్లపై చర్చించి వాటి అనుభవాల నేపథ్యంలో ఈసారి యాత్రను విజయవంతం చేయడానికి కావలసిన సూచనలు చేశారు.
చిన్న ఊరేగింపులు అనుసంధానమయ్యే కూడళ్ల వద్ద , మతపరమైన ప్రదేశాల వద్ద, సమస్యాత్మకమైన ప్రాంతాల్లో ప్రత్యేక అదనపు బలగాలను మోహరించి నిరంతరం నిఘా కొనసాగించాలని సూచించారు.ఈ కాన్ఫరెన్స్లో లా అండ్ ఆర్డర్ అడిషనల్ కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్, స్పెషల్ బ్రాంచ్ డీసీపీ చైతన్యకుమార్, ఐటీ సెల్ డీసీపీ పుష్ప మరియు వర్చువల్గా జోనల్ డీసీపీలు, ఏసీపీలు, ఎస్హెచ్ఓలు పాల్గొన్నారు.