హైదరాబాద్ : ఉద్యమనేత, తెలంగాణ సాధకుడు కేసీఆర్ జన్మదిన వేడుకలు(KCR birthday) రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ కారుడు మల్లేపల్లి నర్సింలు దంపతులు బసవతరాకం క్యాన్సర్ హాస్పిటల్ వద్ద రోగులకు పండ్లు, టిఫిన్స్ పంపిణీ చేశారు. నర్సింలు-అనిత దంపతుల కుమారుడికి కేసీఆర్ ఇటీవలే సుమన్ అని నామకరణం చేశాడు. దీంతో సుమన్ చేతుల మీదుగా వారు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండూ నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు.
శతమానం భవతి.. సుమన్
కాగా, ఇటీవల నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో హృద్యమైన సన్నివేశం ఒకటి చోటుచేసుకున్నది. ఒక వీరాభిమాని తన బిడ్డను కేసీఆర్ చెంతకు తీసుకొచ్చి, ఆ బిడ్డకు పేరు పెట్టాలని కోరారు. ఆ విన్నపాన్ని మన్నించిన గులాబీ బాస్.. ఎంతో ఆప్యాయంగా ఆ చిన్నారిని తన చేతుల్లోకి తీసుకొని నామకరణం చేశారు. కేసీఆర్ ఆశీర్వాదంతో, ఆయన చేతులమీదుగా తమ కుమారుడికి పేరు పెట్టుకోవాలన్న తెలంగాణ ఉద్యమకారుడి ప్రయత్నం నెరవేరింది.
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం మల్లేపల్లికి చెందిన దొడ్ల నర్సింహులు తెలంగాణ ఉద్యమకారుడు. తన కుటుంబంతో వచ్చిన నర్సింహులు, అనిత దంపతులను కేసీఆర్ ఆప్యాయంగా ఆహ్వానించారు. వేద పండితుడి సలహాతో, బాబు జన్మనక్షత్రం ప్రకారం వచ్చిన ‘సు’ అక్షరాన్ని ఆధారం చేసుకుని సుమన్ అనే పేరు పెట్టారు. చిన్నారి బాబును ప్రేమతో తలపై నిమిరి సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేండ్లు వర్ధిల్లాలని కేసీఆర్ ఆశీర్వదించారు. అక్కడున్న వారందరూ కేసీఆర్ అభిమానుల పట్ల చూపే నిరుపమానమైన ప్రేమను చూసి ముగ్ధులయ్యారు.

సుమన్‌ను ఆశీర్వదిస్తున్న కేసీఆర్..