అబిడ్స్, ఏప్రిల్ 18 పాత వస్తువుల విక్రయాలకు పేరుగాంచిన జుమ్మెరాత్‌బజార్ అంగడిలో నెమలి తలతో పాటు పలు ప్రాణు ల అవయవాలను విక్రయించేందుకు వచ్చిన ముగ్గురు మహిళలను షాహినాయత్‌గంజ్ పోలీసులు అదుపులోకి తీసుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…మహారాష్ట్ర జాల్న ప్రాంతానికి చెందిన ముగ్గురు మహిళలు జుమ్మెరాత్బజార్లోని అంగడిలో నెమ లి తలతో పాటు బ్లాక్ ఐబీస్ పక్షికి సంబంధించి నాలుగు పుర్రెలు, ఎనిమిది కాళ్లు, నకిలీ పులి చర్మం, గోర్లను విక్రయించేందుకు యత్నిస్తుండగా పసిగట్టిన పోలీసులు వారిని పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు.
అటవీ శాఖకు చెందిన ఓ మాజీ అధికారి ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు జుమ్మెరాత్‌బజార్‌లో దాడి జరిపి వీటిని పట్టుకున్నట్లు సమాచారం. అటవీ శాఖ అధికారులకు ముగ్గురు మహిళలతో పాటు నెమలి తలతో పాటు వన్య ప్రాణుల అవయవాలను అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ విక్రయాలపై హైదరాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా పోలీసులు అప్పగించిన మాంసపు అవయవాలు నకిలీవని తెలిపారు. నెమలి ఈకలు మాంసం ముద్దలకు పెట్టి విక్రయించేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. నకిలీ అవయవాలు అని తేలడంతో ముగ్గురు మహిళలను వదిలేసినట్లు వివరించారు.