సిటీబ్యూరో, జూన్ 1(నమస్తే తెలంగాణ): పదేండ్ల కాలంలో కేసీఆర్ సర్కారు వైద్యానికి పెద్దపీట వేస్తే, రేవంత్ ప్రభుత్వం దాన్ని విస్మరిస్తున్నది. బస్తీ దవాఖానలు మొదలుకొని జిల్లాలోని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఈఎన్టీ వంటి పెద్దాసుపత్రుల వరకు సిబ్బంది కొరత వెంటాడుతున్నది. ఎనిమిది నెలల కిందట చేసిన బదిలీల కారణంగా ఏర్పడిన ఖాళీలను భర్తీ ఇంత వరకు చేయకుండా కాంగ్రెస్ సర్కార్ చోద్యం చూస్తుండటంతో వైద్యం కోసం సర్కారు ఆసుపత్రుల మెట్లెక్కే వారికి సకాలంలో నాణ్యమైన వైద్యం అందించలేకపోతున్నారు. హైదరాబాద్ జిల్లాలోని కోఠిలో ఉన్న ఏకైన ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రిలో నేటికీ సరిపడా ఫార్మాసిస్టులు, వైద్యులు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్లో ఉన్న ఈఎన్టీ ప్రభుత్వ ఆస్పత్రికి రెండు తెలుగు రాష్ర్టాల నుంచి మాత్రమే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి సైతం రోగులు వస్తుంటారు. ప్రతి సోమవారం సుమారు 2వేల మంది వరకు ఔట్ ఫేషెంట్లు రాగా, మిగతా రోజుల్లో 1500 వరకు వస్తుంటారు. 125 మంది వరకు ఇన్ఫేషెంట్లుగా చికిత్స పొందుతుండటం గమనార్హం. ప్రభుత్వాసుపత్రి కావడంతో రోగుల తాకిడి అధికమనే చెప్పాలి. కానీ సరిపడా సిబ్బంది లేక వైద్యం కోసం రోజుల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది. గతంలో ఆరుగురు ప్రొఫెసర్లు, నలుగురు ఫార్మాసిస్టులు ఉండగా, ఎనిమిది నెలల కిందట జరిగిన బదిలీల్లో ఇతర జిల్లాలకు వెళ్లారు. దాంతో ప్రస్తుతం ఈఎన్టీలో ఇద్దరు ప్రొఫెసర్లు, ఒక్క ఫార్మాసిస్టు మాత్రమే ఉన్నారు.
రోగుల తాకిడి అధికంగా ఉండటంతో వార్డు నర్సులు సైతం ఫార్మసీలో విధులు నిర్వహిస్తుండటం గమనార్హం. అయినా కూడా ఫార్మాసిస్టుల కొరతను అధిగమించడం కష్టంగా మారింది. రోగులకు వైద్యం అందించి, శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు వివిధ విభాగాలకు చెందిన ఆరుగురు ప్రొఫెసర్లు విధులు నిర్వహిస్తుండగా.. వారిలో నలుగురు బదిలీపై వెళ్లారు. ప్రస్తుతం ఇద్దరు మాత్రమే తమ విభాగాలకు చెందిన రోగులను పరీక్షిస్తుండటం గమనార్హం. ఇదిలా ఉండగా వినికిడి లోపం ఉన్నవారికి చేసే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ వంటి కీలక శస్త్ర చికిత్సలకు సైతం ఇతర జిల్లాల వైద్యులను రప్పించడం జరుగుతుంది. వైద్యుల కొరతతో అత్యవసర చికిత్సలప్పుడు ఉన్నవారిపైనే తీవ్ర ప్రభావం పడుతున్నది.
ప్రస్తుత రోజుల్లో ఈఎన్టీకి రోగుల తాకిడి ఎక్కువైతున్నది. దీనిలో భాగంగా ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం చాలా ఉన్నది. ప్రస్తుతం ఉన్న ప్రొఫెసర్, ఫార్మాసిస్టు పోస్టులతోపాటు రెండు రేడియోగ్రాఫర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉన్నది. రెగ్యులర్ రేడియోగ్రఫర్కు బదులు కాంట్రాక్ట్ ఉద్యోగిని నియమించారు. సరిపడా సిబ్బంది లేకపోవడంతో ఉన్నవారితోనే పనిచేయించడం వల్ల పని ఒత్తిడికి గురవుతున్నారు. సరిపడా సిబ్బందిని నియమించి పనిభారం తగ్గించాలని వైద్యులు వేడుకుంటున్నారు.
మరోవైపు సిబ్బంది కొరతలేకుండా సత్వర వైద్యం అందించాలని రోగులు, బంధువులు అభిప్రాయపడుతున్నారు. బదిలీలు చేసి ఎనిమిది నెలలు గడుస్తున్నా నేటికి ఖాళీలను భర్తీ చేయకపోవడంపై ప్రతిపక్షాలు, సామాన్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే రోగుల కోసం సరిపడా సిబ్బందిని నియమించాలని అభిప్రాయపడుతున్నారు.