సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ): గగన్‌పహాడ్ ఆరాంఘర్ ప్రధాన రహదారిలో ఒకే బైక్‌పై ఎనిమిది మంది ప్రయాణం చేశారు. రద్దీగా ఉండే రోడ్లపై కేరింతలు వేస్తూ రహదారిపై ఫీట్లు చేశారు. ప్రమాదకర స్టంట్స్ చేస్తూ రోడ్డుపై ప్రయాణించే ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగించారు. సోషల్ మీడియాలో వీరి ఫీట్లు చూసిన రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
చందన్బాగ్ చాంద్రాయణగుట్ట రోడ్డులో గత నెలలో అర్ధరాత్రి మూడు ఆటోలు విన్యాసాలు చేశాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆటోలు ఒక్క చక్రంపై తిప్పడం, ఒకరినొకరు రేసింగ్.. ఇలా ఆ రోడ్డుపై పలువురు వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి. ఈ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు ఏడుగురిపై కేసులు పెట్టారు.
బేగంపేట ప్రకాశ్‌నగర్ మార్గంలో కొన్నిరోజుల కిందట ఏడుగురు యువకులు అర్ధరాత్రి బైక్‌లపై హల్చల్ చేశారు. అర్ధరాత్రి సమయంలో విపరీతమైన సౌండ్స్, మితిమీరిన వేగంతో వారు చేసిన ఫీట్లు రోడ్డుపై పక్కనే వెళ్తున్న వాహనదారులను భయాందోళనలకు గురిచేశాయి. రేసింగ్‌తో పాటు వీళ్లు చేసిన ఫీట్లు సోషల్ మీడియా ద్వారా పోలీసుల దృష్టికి రావడంతో కేసు నమోదు చేసిన అధికారులు ఏడుగురిని అరెస్ట్ చేశారు.
సోషల్ మీడియాలో హైలైట్ అవడానికి గత సంవత్సరం వర్షాకాలంలో హయత్‌నగర్ పరిధిలోని పెద్ద అంబర్‌పేట సమీపంలో నేషనల్ హైవేపై కేటీఎం బైక్‌పై ఇద్దరు యువకులు స్టంట్స్ రీల్స్ చేసే ప్రయత్నంలో బైక్ అదుపు తప్పి కిందపడిపోయి ఒక యువకుడు మృతిచెందగా, మరొకరు తీవ్రగాయాలపాలయ్యాడు.
రెండురోజుల కిందట హిమాయత్‌నగర్‌లో ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణించిన ఫొటోను ఓ నెటిజన్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగం ఎక్స్ అకౌంట్‌కు ట్యాగ్ చేశారు.
వర్షాకాలంలో రోడ్లపై విన్యాసాలు చేయడం వల్ల ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ప్రతీరోజూ బైక్ రేసింగ్స్, రాష్ డ్రైవింగ్ పెరిగిపోతున్నదని పోలీసులే చెబుతున్నారు. వీటిని నియంత్రించడంలో తమతో పాటు పేరెంట్స్‌కు కూడా బాధ్యత ఉంటుందనేది పోలీసుల వాదన. నడిరోడ్లపై సాగే ఈ సర్కస్ ఫీట్లలో పాల్గొంటున్న వారంతా యువకులు ప్రధానంగా కళాశాల విద్యార్థులు కావడం గమనార్హం. ఈ స్టంట్ల విషయంలో పోలీసులు అవసరమైన స్థాయిలో ముందస్తు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఎప్పుడో అడపాదడపా మినహాయిస్తే ఎక్కువ సందర్భాల్లో ఫీట్లు పూర్తయిన తర్వాతే పోలీసుల దృష్టికి వెళ్తోంది.
సోషల్‌మీడియాలో వైరల్..
ఇటీవల కాలంలో ఒకే బైక్‌పై పరిమితికి మించి అది కూడా నాలుగు నుంచి ఎనిమిది మంది వరకు ప్రయాణిస్తూ పోలీసుల కళ్లు కప్పి పోతున్నారు. వీరి విన్యాసాలను తోటి వాహనదారులే వీడియోలు తీసి.. సోషల్‌మీడియాలో వైరల్ చేస్తున్నారు. ప్రధానంగా పోలీసుల దృష్టిలో పడకుండా అనునిత్యం నగరంలోని అనేక ప్రాంతాల్లో యువత రెచ్చిపోతున్నారు. వాహనాలపై తిరుగుతూ ప్రమాదకరమైన ఫీట్లు, స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
సోషల్ మీడియా ప్రభావంతో రీల్స్ చేసి లైక్స్, షేర్స్ పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాతే పోలీసుల దృష్టికి వస్తున్నాయి. దీంతో ఆయా వాహనాల నంబర్ల ఆధారంగా ముందుకు వెళ్తున్న పోలీసులు వారిని పట్టుకుని చర్యలు తీసుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్‌లలో రీల్స్, షార్ట్స్ కోసం బైకర్లు చేస్తున్న వెర్రి విన్యాసాలు, డేంజర్ డ్రైవింగ్‌కు సంబంధించి తోటి ప్రయాణికులే వీరి వీడియోలు తీసి సోషల్‌మీడియాలో వైరల్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా ట్రై కమిషనరేట్ల ఎక్స్ అకౌంట్లకు డైరెక్ట్‌గా ట్యాగ్ చేస్తూ వీరి ఫీట్లను పోస్ట్ చేస్తున్నారు. వీటిని చూసిన తర్వాతే పోలీసులు బైకర్స్, డ్రైవర్లపై కేసులు పెడుతున్నారు.
పోలీస్ నిఘా పెంచాలి..
ప్రధానంగా ఇన్నర్ రింగ్‌రోడ్డుతో పాటు బోయిన్పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, రాజేంద్రనగర్, రాయదుర్గం, ఔటర్‌రింగ్‌రోడ్డుకు సంబంధించిన సర్వీస్రోడ్డులోని కొన్ని చోట్ల ఈ విన్యాసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అర్ధరాత్రి వేళల్లో జరుగుతున్న వీటి వల్ల తోటి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నిఘా ఉన్నప్పటికీ అది పూర్తి స్థాయిలో ప్రభావం చూపడం లేదని తెలుస్తోంది. స్టంట్లు పూర్తయిన తర్వాత వీడియోలు, సీసీ కెమెరాల ఆధారంగా బాధ్యులను పట్టుకోవడం వల్ల పెద్దగా లాభం లేదనే వాదన వినిపిస్తోంది.
ఈలోపు నష్టం పెద్ద ఎత్తున జరుగుతున్నదని, ఈ నేపథ్యంలో ఇలాంటి విన్యాసాలు జరిగే ప్రాంతాల్లో నిఘా పెంచాల్సిన అవసరం ఉందని ఆయా ప్రాంతాల స్థానికులు చెబుతున్నారు. సాధారణంగా ఇక్కడ పెట్రోలింగ్‌తో పాటు డ్రోన్లతో నిఘా పెట్టి భద్రత పెంచాల్సిన అవసరముందని ఒక పోలీస్ అధికారి చెప్పారు. ఇటువంటి బైక్ రేసింగులకు, ప్రమాదకర విన్యాసాలకు పాల్పడే వారిపై బీఎన్ఎస్తో పాటు మోటారు వాహన చట్టం, సీపీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.