బంజారాహిల్స్,మే 15: సాయం చేయాలంటూ పిలిచి మొబైల్ ఫోన్‌ను(Cellphone) తస్కరించిన వ్యక్తులపై ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. లంగర్‌హౌజ్(Langerhouse) సమీపంలోని ప్రశాంత్‌నగర్‌కు చెందిన ఎం.విజయ్‌కుమార్ ఈ నెల 11న పనిమీద ఓయూ కాలనీలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడ పని ముగిసిన తర్వాత టిఫిన్ చేసేందుకు భీమాస్ హోటల్‌కు వెళ్లాడు. టిఫిన్ చేసిన తర్వాత కారు తీసుకునేందుకు వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి అతడి సమీపంలో కిందపడిపోయినట్లు నటించారు.
వారిలో ఓ వ్యక్తి రోడ్డుమీద పడి ఉండగా రెండో వ్యక్తి బైక్ లేపడానికి ప్రయత్నిస్తూ సాయం చేయాలంటూ విజయ్‌కుమార్‌ను కోరాడు. దీంతో బైక్‌ను లేపగానే వేగంగా ఇద్దరూ కలిసి ముందుకు దూసుకువెళ్లారు. వారు వెళ్లిన తర్వాత తన జేబులో చూసుకోగా విజయ్‌కుమార్‌కు చెందిన మొబైల్ కనిపించలేదు. అన్ని ప్రాంతాల్లో గాలించినా లాభం లేకపోవడంతో తనను సాయం కోరినట్లు నటించిన వారే మొబైల్ ఫోన్ తస్కరించి ఉంటారని బాధితుడు బుధవారం ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఐపీసీ 420,379 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.