Kukatpally | కుత్బుల్లాపూర్, మార్చి 27: తాళం వేసిన ఇండ్లే అతడి టార్గెట్.. పగలు రెక్కీ నిర్వహించి.. రాత్రుళ్లు చోరీలకు పాల్పడుతాడు. చోరీ చేసిన సొమ్ము అంతా ఓ చోట పెట్టి… తన అవసరం కోసం కొంచెం కొంచెం వాడుకుంటూ జల్సాలకు పాల్పడుతున్న ఓ ఘరానా దొంగ పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. బాలానగర్ జోన్ డీసీపీ సురేశ్‌కుమార్ తెలిపిన ప్రకారం… కూకట్పల్లి తులసినగర్ హెచ్ఎంటీ హిల్స్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ నాసర్ అలియాస్న సరోద్దీన్(34) వృత్తిరీత్యా సోఫా మరమ్మతులు చేస్తుంటాడు.
ప్రవృత్తి మాత్రం దొంగతనాన్ని ఎంచుకున్నాడు. పగలంతా తాళం వేసిన ఇండ్లను రెక్కీ చేసి.. రాత్రి సమయంలో అదే ఇండ్లలోకి చొరబడి తలుపులు, కిటికీలు తన చాకచక్యంతో తొలగించి లోపలికి ప్రవేశించి విలువైన డబ్బు, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లడంతో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు కూడా నమోదు అయ్యాయి. కాగా ఓ మహిళను హత్య చేసిన ఘటనలో కీలకంగా ఉండటంతో పీడీ యాక్ట్ తో ఏడాది పాటు జైలు జీవితం కూడా గడిపాడు.
అయినా తన తీరు మారకుండా బయటకు వచ్చాక తిరిగి దొంగతనాలకు పాల్పడటం మామూలుగా మారింది. దీనిలో భాగంగానే ఈనెల 22వ తేదీన అర్థరాత్రి నిందితుడు బాచుపల్లిలోని కాకతీయ హిల్స్ సరోవర్ బిల్డింగ్ రాజీవ్ గృహకల్ప రోడ్డులోని జీ-1 లో తలుపులు వేసిన ఓ ఇంట్లోకి ప్రవేశించి బలవంతంగా తలుపులు తెరిచి అల్మారాలోని దాదాపు రూ.20లక్షల విలువైన 25 తులాల బంగారు ఆభరణాలు, 15 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లాడు.
ఆలస్యంగా తేరుకున్న బాధితులు ఈనెల 26వ తేదీన బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు భాగంగా పాత నేరస్థుల జాబితా ఆధారంగా నిందితుడిని పట్టుకొని విచారించారు. దీంతో దొంగలించిన సొమ్మును బౌరంపేటలోని ఎన్ పి రాయల్ ఫర్నిచర్ దుకాణానికి తీసుకెళ్లి పరిశీలించగా.. అందులో 20 తులాల బంగారం, 15 తులాల వెండి ఆభరణం ఉన్న బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నేరస్తుడి పాత చరిత్ర..
2013లో సరూర్‌నగర్ పోలీసులు మహిళను హత్య చేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేశారు. 2016లో అతను నగ్మా అనే మహిళను వివాహం చేసుకుని ఒక బిడ్డకు తండ్రి అయ్యాడు. 2017లో రమ్య గ్రౌండ్ సమీపంలోని కేపీహెచ్ బీలో నౌషీన్ సోఫా, బెడ్ వర్క్స్ దుకాణాన్ని స్థాపించి తరువాత శోభారాణి అనే ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు అప్పటికే వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీంతో కుటుంబసభ్యుల మధ్య కొన్ని కుటుంబ వివాదాలు తలెత్తాయి. దీని కారణంగా అతను భారీ నష్టాన్ని చవిచూశాడు.
ఈ నష్టాలను పూరించుకునేందుకు దొంగతనాల బాటపడ్డాడు. కేపీహెచ్‌బీ, బాచుపల్లి పరిధిలో ఆస్తి నేరాలకు పాల్పడ్డాడు. కేపీహెచ్‌బీ పోలీసులు అతడి పై పీడీ చట్టం కింద జైలుకు పంపారు. ఒక సంవత్సరం తర్వాత అంటే 2020లో అతడు జైలు నుంచి విడుదలై రెండో భార్య శోభారాణితో కలిసి ఉన్నాడు. వ్యాపారం మందకొడిగా ఉండటంతో అతడు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అందువల్ల సులభంగా డబ్బు సంపాదించడానికి ఏదైనా దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు.
కానీ, పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఈ కేసును బాలానగర్‌లోని ఐపీఎస్, డీసీపీ కె. సురేశ్‌కుమార్ మార్గదర్శకత్వంలో, కూకట్‌పల్లిలోని ఏసీపీ కె. శ్రీనివాసరావు పర్యవేక్షణలో, బాచుపల్లి పీఎస్, డీఐ పీ. యాదయ్య గౌడ్, ఎస్హెచ్ఓ జె. ఉపేందర్ రావు, క్రైమ్ సిబ్బంది డి. చంద్రశేఖర్, డీస్ఐ టి.అంజయ్య, పీసీ టి. శ్రీనివాస్, పీసీ ఎం. కనకయ్యలను అభినందించి వారికి తగిన రివార్డులు ప్రకటించారు.