హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని హామీ ఇచ్చి గాలికి వదిలేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి జీవనోపాధిని దెబ్బకొట్టారు. బతుకు భారమై పదుల సంఖ్యలో ఆటోడ్రైవర్లు మరణిస్తున్నా చీమకుట్టినట్టు కూడా లేదు. కనీసం మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఏటా ఆర్థిక సాయం అందించాలని కోరుతుంటే పట్టించుకోవడం లేదు.. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ఆటోడ్రైవర్ల దీనస్థితి ఇది.
ఇలాంటి పరిస్థితుల్లో ఆటోడ్రైవర్లను ఆదుకోవాల్సిందిపోయి.. ఇప్పటికే చితికిపోయిన వారి పొట్టగొట్టి రూ.140 కోట్లు దండుకునేందుకు ప్లాన్ వేశారు. కొత్త ఆటోలకు అనుమతుల పేరుతో భారీ దందాకు తెరలేపారు. ఓ మంత్రి నేతృత్వంలో అధికారులు, ప్రైవేట్ ఫైనాన్షియర్లు కుమ్మక్కయ్యి ‘ఆటో’ ట్యాక్స్‌ను ముక్కుపిండి వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఒక్కో ఆటోకు రూ.70వేలు అదనం
కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగు రోడ్డు లోపల కొత్తగా 20వేల సీఎన్జీ, ఎల్పీజీ ఆటోలకు అనుమతి ఇచ్చింది. కాలుష్యాన్ని నియంత్రించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించినా, తెర వెనక పెద్ద దందా ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కంపెనీలు నిర్ణయించిన ఆటో ధరలతో సంబంధం లేకుండా తాము నిర్ణయించిన మొత్తం చెల్లించాలని అల్టిమేటం జారీ చేస్తున్నట్టు సమాచారం. సాధారణంగా సీఎన్జీ ఆటోకు కంపెనీ ధర రూ.2.47లక్షలు, ఎల్పీజీ అయితే రూ.2.36లక్షలుగా ఉన్నది.
కానీ అనుమతి కావాలనుకునేవారి నుంచి ‘మినిస్టర్ ఆటో ట్యాక్స్’ కలిపి రూ.3.17 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. అంటే ఒక్కో ఆటోకు రూ.70వేలు అదనంగా వసూలు చేస్తున్నారన్నమాట. ఈ బాధ్యతను కొందరు ఫైనాన్షియర్లకు అప్పగించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అదనపు డబ్బులు చెల్లించిన వారికే ఆటోలు అమ్మేలా ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఇలా రూ.140 కోట్ల మేర వసూలు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇందులో ప్రభుత్వంలోని ముఖ్య నేతకూ వాటాలు వెళ్తాయని చెప్తున్నట్టు సమాచారం.
ప్రత్యేక కౌంటర్లు తెరిచి మరీ..
కొందరు ఫైనాన్షియర్లు లక్డీకపూల్, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్‌లోని తమ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు తెరిచి ‘మినిస్టర్ ఆటో ట్యాక్స్’ వసూలు చేస్తున్నట్టు చెప్తున్నారు. వారి సిబ్బంది ఆటో కొనుగోలు చేయాలనుకునే వారిని నేరుగా తమ కార్యాలయాలకు తీసుకెళ్తున్నారని, రూ.3.17 లక్షలకు ఫైనాన్స్ చేయిస్తున్నారని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. ఇన్వాయిస్ ధరకు సంబంధం లేకుండా రూ.70వేలు అదనంగా వసూలు చేస్తున్నట్టు కొంతమంది ఆటో డ్రైవర్లు చెప్తున్నారు. ఈ మార్గంలో వెళ్తేనే అనుమతులు వస్తాయని, ఆర్టీఏ అధికారులు సూచించిన విధంగా ఆటో కోసం దరఖాస్తు పెట్టుకుంటే రాదని బెదిరిస్తున్నారట.
ఇప్పటికే రాజధానిలో 1.40 లక్షలకుపైగా ఆటోలున్నాయి. ఇందులో పెట్రోల్, డీజిల్ ఆటోలను ఓఆర్ఆర్ లోపల నిషేదిస్తున్నట్టు సర్కార్ పేర్కొన్నది. వాటి స్థానంలో ఎలక్ట్రిక్ ఆటోలను తీసుకువస్తామని ప్రకటించింది. కానీ ఇప్పుడు జీవో 263తో సీఎన్జీ, ఎల్పీజీ ఆటోలకు కూడా అనుమతిచ్చింది. అయితే ఈ నిబంధనలను కూడా బేఖాతరు చేస్తూ సీఎన్జీ/పెట్రోల్, ఎల్పీజీ/పెట్రోల్ ఆటోలను విక్రయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే నగరంలో ఉన్న వాహనాలకే సరిపడా సీఎన్జీ గ్యాస్ సరఫరా కావడం లేదు. రాత్రుళ్లు క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇలాంటి పరిస్థితుల్లో మరో 20వేల ఆటోలు రోడ్డెక్కితే పరిస్థితి ఏంటనేది రవాణా శాఖ అధికారులకే తెలియాలి. గతంలో 2002లో బూరేలాల్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం హైదరాబాద్ పరిధిలోకి బయటి ఆటోలను నిషేధించారు. పర్మిట్ ఉన్నవాటిని మాత్రమే అనుమతినిచ్చారు. నగర విస్తరణలో భాగంగా 2012లో 20వేల పెట్రోల్/సీఎన్జీ, ఎల్పీజీ ఆటోలకు అనుమతినిచ్చారు.
ఇప్పుడు కాలుష్యాన్ని వెదజల్లే ఆటోలు ఓఆర్ఆర్ లోపల ఉండకూడదని చెప్పి.. మళ్లీ సీఎన్జీ, ఎల్పీజీ ఆటోలను ప్రోత్సహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన ఆటోడ్రైవర్లను ఆదుకుంటామని, డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు కొత్త ఆటోలను అనుమతించడంపై టీఏటీయూ నాయకులు వేముల మారయ్య, నిరంజన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సూర్యాపేటలో ఆటో కార్యికులతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.