సిటీబ్యూరో: నిర్మాణ రంగ అనుమతులు మరింత సులభతరం చేస్తూ ‘బిల్డ్ నౌ’ విధానాన్ని అమలు చేయబోతున్నట్లు ఆర్భాటంగా ప్రకటించిన బల్దియా.. ఆచరణలో అపసోపాలు పడుతున్నది. ప్రస్తుతం అమలవుతున్న టీజీబీపాస్ మించి తక్కువ సమయంలో ఇంటి నిర్మాణ అనుమతులు పొందవచ్చని, ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ టెక్నాలజీ రూపొందించిన బిల్డ్ నౌతో అనుమతుల జారీలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు హడావుడి చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బిల్డ్ నౌ అప్లోడ్ చేసే విధానంపై ఆర్కిటెక్ట్‌లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అంతేకాకుండా ఈ నూతన విధానంపై జోనల్, డిప్యూటీ కమిషనర్లకు అవగాహన కల్పించారు.
ఈ నేపథ్యంలోనే ఈ నెల 10 నుంచి బిల్డ్ నౌ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని స్వయంగా కమిషనర్ ఇలంబర్తి ప్రకటించారు. 14వ తేదీ వచ్చినా.. బిల్డ్ నౌ పై మౌనంగా ఉన్నారు. ప్రారంభ సమయంలో భాగంగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని, గడిచిన రెండు రోజులుగా సదరు సాఫ్ట్వేర్ నిపుణులు తర్జన భర్జన పడుతున్నట్లు తెలిసింది. బిల్డ్ నౌ విధాన ఆమలులో మరింత ఆలస్యం కానుందని టౌన్‌ప్లానింగ్ వర్గాలు తెలిపాయి. మొత్తంగా ఆదిలోనే ఆధునిక విధానం అపసోపాలు పడుతుండడంపై నిర్మాణదారుల్లో ఆందోళన నెలకొంది.
15 రోజుల్లోనే అనుమతి..
బిల్డ్ నౌ విధానం అమల్లోకి వస్తే ఇంటి అనుమతి 15 రోజుల్లోపే లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు సమయంలో ఉన్న లోపాలను గుర్తిస్తుందని, ప్లాన్ మొదటి నుంచి పరిశీలించాల్సిన అవసరం ఉండదని, గుర్తించిన అంశాన్నే సవరించి అప్లోడ్ చేసే వెసులుబాటు ఉందన్నారు.
75 గజాల లోపు ఉంటే..
ఇంటి స్థలం విస్తీర్ణం 75 గజాల లోపు ఉంటే దరఖాస్తు చేసుకోగానే అనుమతి వచ్చేస్తుందని అధికారులు చెబుతున్నారు. భవన నిర్మాణానికి ఆర్కిటెక్ట్‌లు రూపొందించే డ్రాయింగే ప్రామాణికం. ప్రస్తుత వ్యవస్థలో డ్రాయింగ్ పరిశీలనకు కొన్ని వారాల సమయం పడుతోందని.. ఇది కాస్తా నిమిషాల్లో తగ్గనుందని చెప్పిన అధికారులు..ఆచరణలో మాత్రం తమ చిత్తశుద్ధిని ప్రదర్శించకలేకపోతున్నారు.