Hyderabad | సిటీబ్యూరో, ఫిబ్రవరి14, (నమస్తే తెలంగాణ): మనం రోజుకు రెండు సిగరేట్లు పీలుస్తున్నాం తెలుసా?! అదేందీ.. మాకు సిగరేట్లాంటి పాడు అలవాటు లేదు కదా అనుకుంటున్నారా!! సిగరేటే తాగాల్సిన అవసరం లేదండీ… అంతటి హానికరమైన గాలిని పీల్చినా ఆమేర ప్రభావం ఉంటుంది. నగరంలో నానాటికీ పెరుగుతున్న వాయు కాలుష్యంతో ప్రాణ వాయువు వెంటే కాలుష్యభూతం కూడా మన ఊపిరితిత్తుల్లోకి వెళ్తోంది. ఆ భూతా న్ని లెక్కిస్తే రోజుకు రెండు సిగరేట్లు తాగినంత హానికరమట!.. ఇది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వెల్లడించిన ఆందోళనకరమైన వాస్తవం. గాలి నాణ్యత సూచిక ప్రకారం.. హైదరాబాద్ నగరంలోని జనాలు నిత్యం పీల్చుకునే గాలి రోజుకు 2.1 సిగరేట్లు తాగినంత సమానమట. అలా వారానికి 14.7 సిగరేట్లు… అంటే నెలకు 63 సిగరెట్ల పొగను మనం లోపలికి పంపుతున్నాం.
నగరంలో గాలి నాణ్యత రోజురోజుకీ క్షీణిస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇందుకు ప్రధాన కారణం వాహన కాలుష్యమని అందరికీ తెలిసిన వాస్తవమే. అయినప్పటికీ ట్రాఫిక్ జాంలతో ఆ భూతం మరింత బలపడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే నగరంలో గాలి నాణ్యత పడిపోతుందనే కఠోర నిజాన్ని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ స్పష్టం చేస్తుంది. శుక్రవారం సాయంత్రం ఇండెక్స్ నివేదికను పరిశీలించినప్పుడు ఆందోళనకరమైన అంకెలు కనిపించాయి. హైదరాబాద్ నగరంలో శుక్రవారం సాయంత్రం గాలి నాణ్యత సూచికలో పీఎం-10 (వెంట్రుకలో పదివేల వంతు పరిమాణంలో ఉండే కాలుష్యకారక రేణువులు) క్యూబిక్ మీటర్‌కు 124 మైక్రో గ్రామ్స్ ఉన్నాయి. సాధార ణంగా వీటి స్థాయి 10-50 మధ్య ఉండాలి. వంద వరకు ఉంటే క్షీణత మోతాదులో ఉన్నట్లు. కానీ అందుకు రెండున్నర రెట్లకు పైగా ఉందంటే గాలి నాణ్యత ఏస్థాయిలో పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో గాలి నాణ్యత 1.05 రెట్ల మేర ఘోరంగా ఉందని ఇండెక్స్ స్పష్టం చేసింది.
ప్రాంతాలవారీగా చూస్తే… నగరంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే గాలి నాణ్యత క్షీణించినట్టుగా స్పష్టమవుతోంది. ఈ క్రమంలో క్యూబిక్ మీటరుకు లెక్కించినప్పుడు… బంజారా హిల్స్ లో 129, విఠల్‌రావు నగర్లో 127, మాదాపూర్ లో 124, కోకాపేట్ ప్రాంతంలో 124 మైక్రోగ్రామ్స్ కాలు ష్య కణాలు ఉన్నట్లుగా వెల్లడైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 82,45,304 వాహనాలు ఉండగా, అందులో 58,71,539 ద్విచక్ర వాహనాలు, 15 లక్షల కార్లు ఉన్నాయి. బంజారాహిల్స్, విఠల్‌రావు నగర్, కోకాపేట్, మాదాపూర్ ప్రాంతాల్లో ప్రైవేట్, తదితర కార్యాలయాలు అత్యధికంగా ఉండటం వల్ల గ్రేటర్‌లోని 50 శాతం వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. ఆ తీవ్రతనే గాలి కాలుష్యానికి దారి తీస్తుండటం జరుగుతోంది.
పెరుగుతున్న కాలుష్యానికి ప్రధాన కారకులు మానవులే. తాము కూర్చున్న చెట్టు ను తామే నరికే స్థాయిలో మనుగడ సాగిస్తున్నారు. అనవసర పనులకు, కొద్ది పాటి దూరాలకు సైతం మోటర్ వాహనాలు వినియోగిస్తున్నారు. ఆ విధంగా ఒకవైపు శరీరక శ్రమకు దూరంగా, కాలుష్యానికి దగ్గరవుతున్నారు. చెట్లను నరికి పెద్దపెద్ద భవనాలు నిర్మిస్తున్నారు. వనాలను నరికి నగరాలను తయారుచేస్తూ కాలుష్యాన్ని పెంచిపోషిస్తున్నారు. దీంతో పాటు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన హరితహారం కార్యక్రమాన్ని తాజా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. గతంలో ఏడాదికి కోట్లాది మొక్కలను నాటడాన్ని ఒక యజ్ఞంలా కొనసాగించారు. కానీ గత సంవత్సరకాలంగా ఆ స్ఫూర్తి కొరవడింది. ఈ నేపథ్యంలో కనీసం నగరవాసి ఈ భూతం నుంచి రక్షణ కల్పించేందుకు మాస్క్‌లు ధరించడం, కార్లకు ఎయిర్ ఫిల్టర్లు పెట్టుకోవడం, అవసరమైతే తప్ప బయటికి రాకపోవడం, సాధ్యమైనంత వరకు వాహనాల్లో కాకుండా నడకమర్గాన్ని ఎంచుకోవడం వంటి స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.