సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ) : ఆర్టీఏ కార్యాలయాల్లో స్మార్ట్ కార్డుల కొరత వెంటాడుతున్నది. 20 రోజులు గడిచినా ఆర్సీ, లైసెన్స్ కార్డులు అందడం లేదు. దీంతో వాహనదారులు సంబంధిత రవాణా శాఖ ఖార్యాలయాల చుట్టూ తిరగాల్సివస్తున్నది. పోస్టులో మీ ఇంటికే చేరుతుందని అధికారులు చెప్పి చేతులు దులుపుకొంటున్నారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులు నిర్ణీత సమయంలో అందక పోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా వారం రోజుల వ్యవధిలో చిరునామాకు లైసెన్స్లు, ఆర్సీలు చేర్చాల్సిన అధికారులు స్మార్ట్ కార్డుల కొరతతో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తున్నది. లైసెన్స్లు, ఆర్సీ కార్డుల జారీకి వాహనదారుల నుంచి ముందుగానే ఫీజు కట్టించుకుంటారు. కానీ కార్డులు జారీ చేయడానికి మాత్రం జాప్యం చేస్తున్నారు. గ్రేటర్లోని అన్నీ ఆర్టీఏ కార్యాలయాల్లో ఇదే సమస్య ఉన్నట్టు వాహనదారులు చెబుతున్నారు.