సిటీబ్యూరో, జూలై 29 ( నమస్తే తెలంగాణ): ప్రస్తుతం చిన్నారులు సెల్ఫోన్లతో కాలం గడుపుతూ బాల్యాన్ని కోల్పోతున్నారు. ఫలితంగా వారిలో వయసుకు తగ్గ ఎదుగుదల ఉండటం లేదు. పైగా నీరసం, నిస్తేజం, బద్దకం పసితనపు ఎదుగుదలకు బద్ధ శత్రువులుగా మారాయి. బాల్యంలోనే వీటిని అధిగమించేందుకు ఉన్న ఏకైక మార్గం నృత్యమని నిపుణులు చెబుతున్నారు. చదువుతో పాటు ఇతర యాక్టివిటీల్లోనూ పిల్లలను ప్రోత్సహించాల్సిన అవసరముందంటున్నారు.
ప్రయోజనాలెన్నో..
స్టెప్పులు గుర్తుపెట్టుకుని డ్యాన్స్ చేయడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మానసిక ఆందోళన, ఒత్తిడి అధిగమించొచ్చు. 30 నిమిషాల నృత్యం చేస్తే కలిగే లాభం.. గంట పాటు ఈత, పరుగు, సైకిల్ తొక్కడం వల్ల ఖర్చయ్యే క్యాలరీలతో సమానమని అధ్యయనాలు చెబుతున్నాయి. శ్వాస, సంబంధమైన సమస్యలు తగ్గుతాయి. క్రమశిక్షణ అలవడుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. సమయస్ఫూర్తి, నిర్ణయాలు తీసుకోవడంలో మెరుగ్గా ఉంటారు. భావోద్వేగాల నియంత్రణకు ఉపయోగపడుతుంది. ఇది శరీరానికి పూర్తిగా వ్యాయామం. సృజనాత్మకంగా ఆలోచిస్తారు. ఆత్మవిశ్వాసంతో ఉంటారు.
శిక్షణ కేంద్రాలెన్నో..
నగరంలో నృత్యంపై ఆసక్తి పెరుగుతున్నది. పిల్లలకు నృత్యం నేర్పించేందుకు నగరంలో చాలా శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంగీత, నృత్య కళాశాలలు పిల్లలకు వారి అభిరుచికి తగ్గట్టు శిక్షణ ఇస్తున్నాయి. నాలుగేండ్ల సర్టిఫికెట్ కోర్సులు, రెండేండ్ల డిప్ల్లొమా కోర్సులు అందిస్తున్నారు. రాంకోఠి త్యాగరాయ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, మెహిదీపట్నంలోని శ్రీ అన్నమాచార్య ప్రభుత్వం సంగీతం, నృత్యకళాశాల, సికింద్రాబాద్‌లోని శ్రీ భక్తరామదాసు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలు ఉన్నాయి. కూచిపూడి నృత్యం, భరతనాట్యం, పేరిణి నృత్యం, కర్ణాటక గాత్రం, కర్ణాటక వయోలిన్, వీణ, మృదంగం, హిందుస్థానీగాత్రం, తబల, వేణువు, డోలు తదితర వాటిలో పిల్లలకు శిక్షణ ఇస్తారు.
చదువే కాదు ఇతర యాక్టివిటీ ముఖ్యమే
పిల్లల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇప్పుడు అనేక వేదికలు ఉన్నాయి. ముఖ్యంగా టెలివిజన్ చానళ్లు పిల్లల ప్రతిభ కోసం వెతుకుతున్నాయి. అందుకే చిన్నారులు సంగీతం, నృత్యం నేర్చుకుంటున్నారు. జంక్‌ఫుడ్ అలవాట్లతో శారీరక శ్రమకు దూరమవ్వడం అనేది ఇప్పటి పిల్లల్లో కనిపిస్తున్నది. చదువులకే పరిమితమైన విద్యార్థులకు కసరత్తుగా నృత్యం ఉత్తమం. మానసిక ఒత్తిడికి గురయ్యే విద్యార్థులకు నృత్యమే అత్యుత్తమ ఔషధంగా పనిచేస్తుంది.
– పాన్యం కవిత, సైకాలజిస్టు
సంస్కారం నేర్చుకుంటారు
పిల్లలపై చదువు భారం మోపుతున్నారు. వారంతా ఒత్తిడికి గురై నష్టపోతున్నారు. వారి అందమైన బాల్యంలో అనేక చాలెంజ్‌లు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వారికి చదువుతో పాటు నచ్చిన కళలను నేర్పించడం ముఖ్యం. నృత్యంతో పిల్లలకు సంస్కారం తెలుస్తుంది. బాల్యంలోనే పిల్లల్లో మంచి అలవాట్లు అలవడేందుకు నృత్యం మంచి మార్గం.
– ప్రణయ్, నృత్యకారుడు