చార్మినార్, జూలై 4 : తమ సంతానానికి మంచి భవిష్యత్తు అందించాలని తల్లిదండ్రులు ఉన్నంతలో ప్రతి క్షణం ఆరాటపడుతుంటారు. పాతనగరంలో ఓ తల్లి తమ సంతనానికి మరో మార్గం చూపెట్టింది. చూపడమే కాదు స్వయంగా తానే ముందుండి తన నలుగురు కుమార్తెలకు చోరీ ఘటనల్లో తర్పీదు అందించింది. చివరకు పోలీసులకు చిక్కడంతో జైలు జీవితాన్ని గడిపేందుకు సిద్ధమయ్యారు. చార్మినార్ ఇన్స్పెక్టర్ గురునాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన నజ్మా బేగం (55) గత కొంతకాలం కిందట భర్త మహబూబ్‌ఖాన్ మృతి చెందాడు. అప్పటి నుంచి కుటుంబ పోషణ నజ్మాబేగంపై పడింది. నజ్మాబేగం, మహబూబ్‌ఖాన్‌కు షాజాహాన్బేగం(34) , పర్వీన్‌బేగం (32), నూర్‌బేగం(30), సమ్రీన్బేగం (19) అనే నలుగురు కూతుళ్లు ఉన్నారు. ఇంటి పోషణతోపాటు ఇతర ఖర్చుల కోసం నజ్మా బేగం ఆర్థిక పరమైన సమస్యలు ఎదుర్కొంటుంది.
ఈ క్రమంలో ఫిక్ పాకెటింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకోవాలని నజ్మాబేగం నిర్ణయించుకుని తన కుమార్తెలకు తన ఆలోచనలను తెలియజేసి చోరీల కోసం ఒప్పించింది. తల్లీకూతుళ్లు చోరీలు చేసేందుకు చార్మినార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జనసంచారం అధికంగా ఉండే మదీనా, పత్తర్‌ఘట్టి, పటేల్ మార్కెట్ ప్రాంతాలను ఎంచుకున్నారు. ఇలా గత ఆరు నెలలుగా చోరీలకు పాల్పడుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిఘా కొనసాగించిన పోలీసులు మదీనా క్రాస్ రోడ్డు వద్ద తల్లీకూతుర్లు అనుమానాస్పదంగా సంచరిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించగా ఫిక్ పాకెటింగ్లకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.9 వేల నగదుతోపాటు 5 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.